బూత్‌లెవెల్ కమిటీ సభ్యులు గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం మాజీ శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. పొదిలి మండలంలోని ఈగలపాడు, పాములపాడు, జువ్వలేరు గ్రామాల్లో ఆయన పర్యటించారు ‘భవిష్యత్తుకు గ్యారెంటీ- బాబుష్యూరిటీ’ రిజిస్ట్రేషన్లను త్వరగా పూర్తి చేయాలని బూత్‌లెవెల్ కమిటీ సభ్యులకు సూచించారు. రిజిస్ట్రేషన్ విషయంలో అలసత్వం వద్దని సూచించారు. వెలుగొండ ప్రాజెక్ట్‌ను వైసీపీ ప్రభుత్వం వాయిదాల ప్రాజెక్ట్‌గా మార్చిందన్నారు. మార్కాపురం వచ్చినప్పుడు అక్టోబర్‌లో ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తానని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి చెప్పారన్నారు. ఆ మాట నీటి మూటగానే మిగిలిందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వెలుగొండ ప్రాజెక్ట్‌తోపాటు, మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రాంతాలవారీగా ప్రాజెక్ట్‌లను శరవేగంగా పూర్తి చేయాలనే సంకల్పంతో చంద్రబాబు ప్రాజెక్ట్‌లను ప్రారంభించారన్నారు. కానీ జగన్ ఆ ప్రాజెక్టులను మూలనపడేశారని విమర్శించారు. నాలుగున్నరేళ్ల పాలనలో ఎక్కడా అభివృద్ధి లేకుండా దుర్మార్గపు పాలన చేస్తున్నారన్నారు. వైసీపీ నాయకులు దోచుకోవడం, దాచుకోవడంతోనే నాలుగున్నరేళ్ల పాలన సాగిందన్నారు. చంద్రబాబుతోనే యువత భవిష్యత్తు ఉంటుందని గమనించాలన్నారు. బూత్ కమిటీ సభ్యులు జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న దమనకాండను ప్రజలకు అర్ధమయ్యోలా చెప్పాలన్నారు. టీడీపీ హయాంలో సర్పంచ్‌లకు ఎంత గౌరవం ఉందో జగన్ పాలనలో ఎంత గౌరవం ఉందో ఒక్కసారి ప్రజలు గుర్తించాలన్నారు. అదే టీడీపీ, వైసీపీ పాలనకు తేడా అన్నారు. కనుక ఈ విషయాలను ప్రజలు క్షుణ్ణంగా గమనించి రానున్న ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయా లన్నారు. యువనాయకుడు లోకేశ్ యువగళం పాద యాత్ర తిరగి ప్రారంభమైందన్నారు. ఆనాటి నుంచి అదే జోరుతో ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో ఈగలపాడు సర్పంచ్ సుబ్బులు, నాయకులు పాల్గొన్నారు.