ముఖ్యమంత్రి జగన్ రోజూ తినేది ఇసుకేనని, అధికారంలోకొచ్చిన నాలుగున్నరేళ్లలో రూ.5,400కోట్ల ఇసుక బొక్కేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. జగన్ బొక్కుడుతో రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. 214వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా కాకినాడ సర్పవరం జంక్షన్‌లో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు. కరువుతో రాష్ట్రంలో రైతులు అల్లాడుతుంటే ఏరోజూ సీఎం జగన్ అధికారులతో కనీసం సమీక్ష చేయలేదని మండిపడ్డారు. కానీ తెలంగాణలో ఎన్నికల రోజు నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులపై ప్రేమ పొంగుకొచ్చి పోలీసులను పంపి డ్రామా ఆడారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల జీవితాలతో నాలుగున్నరేళ్లుగా అన్ని రకాలుగా ఆడుకున్నది చాలక జగన్ ఇప్పుడు ఆడుదాం ఆంధ్రా.. అనడం విడ్డూరంగా ఉందని నిప్పులు చెరిగారు.