ఏపీలోని పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో తాగునీటి అవసరాల కోసం వెంటనే నీటిని విడుదల చేయాలని ఏపీ జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేఆర్‌ఎమ్‌బీ చైర్మన్‌కు ఏపీ జలవనరులశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి లేఖ రాశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావం కారణంగా సాగు, తాగు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ లేఖ రాశారు. సాగర్, శ్రీశైలం రిజర్వాయర్‌లు తెలంగాణ ప్రభుత్వ అధీనంలో ఉండటంతో ఏపీ ప్రభుత్వ వాట ప్రకారం నీరు విడుదల కావడం లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా నీరు విడుదల చేసుకోవడం, విద్యుత్ ఉత్పాదన కోసం నిబంధనలకు విరుద్ధంగా నీటిని వాడుకున్నారని పేర్కొన్నారు. రెండు రిజర్వాయర్‌లలో నీటిని అక్రమంగా వాడుకోవడం వలన నిల్వలు తగ్గిపోయాయని ఏపీ అధికారి తెలిపారు. ఉమ్మడి ప్రాజెక్ట్‌లను స్వాధీనం చేసుకుంటామని కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను కూడా తెలంగాణ తిరస్కరించిన విషయాన్ని అధికారి గుర్తుచేశారు. పునర్విభజన చట్టంలోని నిబంధనలను కూడా తెలంగాణ ఉల్లఘించిందన్నారు. దీని వలన నీటి వాడకంలో ఏపీకి అడుగడుగునా అన్యాయం జరుగుతుందని లేఖలో ఏపీ జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.