ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రాపై ఎలా ఉండనుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 03, 2023, 06:15 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఉన్న సరళిని బట్టి చూస్తే.. హస్తం పార్టీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఈ స్థాయిలో ప్రజావ్యతిరేకతను ఎవరూ ఊహించలేకపోయారు. చివరి మూడు వారాల్లో ప్రచార సరళిలో వచ్చిన మార్పులతో కాంగ్రెస్ వైపు ఓటర్లు మొగ్గు చూపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సమయంలో బీఆర్ఎస్‌ పట్ల ఈ స్థాయిలో వ్యతిరేకత ఉందని ఎవరూ అనుకోలేదు. అయితే ఎన్నికల గడువు దగ్గరపడే కొద్దీ కాంగ్రెస్ పట్ల అనుకూలత పెరగడం ప్రారంభమైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దాని ప్రభావం పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌పైనా పడే అవకాశం ఉంది. కాంగ్రెస్ విజయం ఏపీలో టీడీపీకి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. దీనికి అనేక ఈక్వెషన్లు కారణం అవుతాయి.


ఇప్పటి వరకూ తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఆంధ్రాలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ అగ్రనేతల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. 2014లో ఎన్నికలు ముగియగానే మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామని.. ఆంధ్రాలో జగన్ గెలుస్తున్నాడని చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన అంచనా ఫలించలేదు. 2014 ఎన్నికల్లో చివరి నిమిషంలో పోటీ చేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించుకుంది. ఆ పార్టీ పోటీ చేయడం కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారింది. ఇక మరో నాలుగున్నరేళ్లు ముందుకొస్తే.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని 2018లో కేసీఆర్ నిర్ణయించారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయడానికి టీడీపీ ఆసక్తి చూపింది. అయితే కేసీఆర్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టి మహాకూటమిగా పోటీ చేసింది. దీంతో కాంగ్రెస్ గెలిస్తే.. తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు ప్రభావం ఉంటుందని కేసీఆర్ ప్రచారం చేశారు. టీడీపీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ఓటమిపాలైంది. తమ పార్టీని ఓడించేందుకు ప్రయత్నించిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ వ్యాఖ్యానించారు.


2019లో ఏపీలో జగన్ గెలిచారు. వైఎస్సార్సీపీ విజయానికి టీఆర్ఎస్ సాధ్యమైనంత వరకు సాయం చేసింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి మంత్రులు ఏపీకి వెళ్లి టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. జగన్ గెలిచాక.. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు రాగా.. ఆయనకు కేసీఆర్ నుంచి సాదర స్వాగతం లభించింది. 2014 నుంచి ఇరు పార్టీల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు మరింత బలపడ్డాయి. ఇప్పటి వరకూ ఇరు పార్టీలు దాదాపుగా అదే తరహా సంబంధాలను కొనసాగిస్తున్నాయి. కేసీఆర్ మోదీతో విబేధించినప్పటికీ.. జగన్ మోదీ సర్కారుకు అండగా నిలిచినప్పటికీ.. ఇద్దరు నేతల మధ్య సంబంధాలు మాత్రం దెబ్బతినలేదు. బీఆర్ఎస్ నేతలకు, వైఎస్సార్సీపీ నేతలకు కామన్ ఎనిమీ చంద్రబాబు నాయుడే. దీంతో శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా వారి చెలిమి సాగింది. బహుశా అందుకేనేమో.. ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ మాకేం సంబంధం అంటూ స్పందించారు. చంద్రబాబు పట్ల సానుభూతిగా మాట్లాడలేదు. హైదరాబాద్‌లో చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ నిరసనలు చేయబోతే.. అడ్డుకున్నారు. ఇది తెలంగాణలోని టీడీపీ శ్రేణులకు, చంద్రబాబు అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. తర్వాత తన వ్యాఖ్యల ప్రభావం చేటు చేసే అవకాశం ఉందని గ్రహించిన కేటీఆర్.. తప్పిదాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆలస్యమైంది.


చంద్రబాబు జైల్లో ఉండటంతో తెలంగాణలో పోటీపై టీడీపీ ఓ నిర్ణయానికి రాలేకపోయింది. చివరకు ఆ పార్టీ పోటీ చేయొద్దని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. బీఆర్ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న టీడీపీ సానుభూతిపరులు కాంగ్రెస్ వైపు మొగ్గారు. కాంగ్రెస్ విజయం కోసం కాంగ్రెస్ కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. చంద్రబాబు ఎవరికీ మద్దతు ప్రకటించకపోయినప్పటికీ... టీడీపీ కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని డిసైడైపోయారు. తమకు 2019లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్‌కు ఇప్పుడు వాళ్ల నుంచి గిఫ్ట్ అందింది.


తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం.. ఏపీలో టీడీపీకి కలిసొచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఎలాగైతే తెలంగాణకు ఉపయోగపడిందో.. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఏపీలో చంద్రబాబు నాయుడికి కలిసొచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ పట్ల జనాల్లో సానుభూతి వ్యక్తమవుతోంది. ఇవన్నీ కలగలిసి చంద్రబాబు బలం పుంజుకోవడానికి దోహదం చేసే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com