ఏపీకి మిచౌంగ్ తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. దీంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తం అయ్యింది. రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.. ధాన్యాన్ని కొనుగోలు చేసి తక్షణమే తరలించేలా ఏర్పాట్లు చేసింది. నూర్పిడులు చేసి ఆరబోతకు వచ్చిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేయనుంది. తుఫాన్ ప్రభావంతో కొద్దిరోజులు ఆన్‌లైన్ విధానానికి బదులుగా ఆఫ్‌లైన్‌లో ప్రత్యేక ఎంట్రీల ద్వారా ధాన్యాన్ని సేకరించేందుకు నిర్ణయించింది, తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో సుమారు 2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు వస్తుందని అంచనా వేస్తోంది. దీనికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో అవసరమైన గోనె సంచులు, రవాణా వాహనాలు, సిబ్బందిని సమకూరుస్తోంది.
తుఫాన్ ముప్పు పొంచి ఉండటంతో వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్‌ను తప్పించి.. ఆఫ్‌లైన్‌లో ధాన్యం ఉత్పత్తుల కొనుగోలుకు వెసులుబాటు కల్పించాలని కోరుతూ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ప్రతిస్పందన వచ్చేలోగా రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముందస్తు ఆఫ్‌లైన్ సేకరిస్తోంది. ఎక్కడికక్కడ ధాన్యాన్ని సేకరించి సమీపంలోని మిల్లులకు తరలిస్తారు. తేమ శాతం అధికంగా ఉన్న ధాన్యాన్ని సైతం సేకరించి డ్రయర్ సౌకర్యం కలిగిన మిల్లులకు రవాణా చేయనున్నారు.
జిల్లాల్లోని మిల్లుల్లో డ్రయర్లు లేకుంటే ఆ ధాన్యాన్ని పొరుగు జిల్లాలకు పంపిస్తారు.. . అందుకయ్యే అదనపు రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. నెల్లూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనే ఎక్కువ డ్రయర్ సౌకర్యం మిల్లులున్నాయి. పౌర సరఫరాల సంస్థ తొలుత రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకుని వ్యవసాయ మార్కెట్ యార్డులు, గోడౌన్లు అనుబంధంగా ఉన్న మిల్లుల్లో స్టోర్ చేయనుంది. ప్రస్తుతం ఏడు జిల్లాల్లో సగటున ఒక్కోచోట 30వేల టన్నుల ధాన్యం ఆరబోత, లోడింగ్ దశల్లో ఉంది. రానున్న 24–36 గంటల్లోగా ఈ మొత్తం ధాన్యం తరలింపు ప్రక్రియను పూర్తి చేస్తారు.
రైతులెవరూ అధైర్యపడొద్దని.. వీలైనంత వేగంగా ఆఫ్‌లైన్‌లో ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్ను అధికారులు. ధాన్యాన్ని బస్తాల్లో నింపి వాహనంలో లోడింగ్ చేసి సమీపంలోని మిల్లులకు తరలించేలా సిబ్బందికి ఆదేశాలిచ్చామన్నారు. ఆలస్యమైతే వర్షాలు కురిసి ధాన్యం తడిసి రంగు మారే ప్రమాదం ఉందన్నారు. ఎఫ్‌టీవోలో చూపించిన మద్దతు ధర మొత్తం రైతుల ఖాతాల్లో తప్పకుండా జమవుతుందన్నారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రైతులెవరూ కోసిన ధాన్యాన్ని పట్టాలు కప్పి రోడ్లపై ఉంచొద్దని.. వెంటనే ఆర్బీకేలోని ధాన్యం సేకరణ కేంద్రాలకు అప్పగించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ధాన్యం కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు.. అధికారులకు కీలక సూచనలు చేస్తున్నారు.