మిచౌంగ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ మంత్రి దేవినేని ఉమా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తుఫాను ప్రభావంతో పంటలు నీట మునిగి, గాలులకు నేలవాలి రైతుల పూర్తిగా నష్టపోయారన్నారు. దేశానికి పట్టెడన్నం పెట్టాలన్న ఉద్దేశంతో కష్టపడే రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని తెలిపారు. పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఉదారంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తూరు తాడేపల్లిలో 2 వేల ఎకరాల వరకు పంట దెబ్బతిన్నదని.. అధికార యంత్రాంగం దెబ్బతిన్న పంటలను, రైతుల వివరాలను త్వరితగతిన నమోదు చేసి రైతును ఆదుకోవాలన్నారు. ఎకరానికి 30 నుండి 35 వేల రూపాయల పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి.. చేతికొచ్చే సమయంలో పంటలు దెబ్బ తినడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో ఇంజన్లతో నీరు పెట్టిన రైతులకు ఎకరానికి ఐదు నుంచి పదివేల రూపాయలు అదనపు ఖర్చు అయిందని దేవినేని ఉమా వెల్లడించారు.