నంద్యాల జిల్లా మహానంది ఆలయానికి భక్తుడు విలువైన కానుకను అందజేశారు. నంద్యాలకు చెందిన రిటైర్డ్ ఎస్‌బీఐ మేనేజర్ మారం వెంకటసుబ్బయ్య దంపతులు 35 కేజీల వెండితో తయారు చేయించిన రుద్రాక్ష మండపాన్ని ఆలయానికి అందజేశారు. ఈ రుద్రాక్ష మండపంను ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డికి దాతలు అందజేశారు. కార్తీక మూడవ సోమవారం సందర్భంగా ఆలయంలో సంప్రోక్షణ అనంతరం దాతల కుటుంబీకులు శ్రీ మహానందీశ్వర స్వామికి ప్రత్యేకపూజలు నిర్వహించి రుద్రాక్ష మండపాన్ని అందించారు.
దాతలు వెంకటసుబ్బయ్యకు కుటుంబీకులకు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మహానందిలో మరింత మంది భక్తులు విరాళాలు అందజేశి ఆలయ అభివృద్ధి లో భాగస్వాములైన స్వామి,అమ్మవార్ల కృపకు పాత్రులు కావలెనని ఈవో కోరారు.రుద్రాక్ష మండపం గర్భ ఆలయంలో స్వామివారి కోసం అలంకరిస్తారు. కార్తీక మాసం కావడంతో మహానందికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.. ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తున్నారు.
మహానంది నందగోపాలుడు అనే రాజు నిర్మించినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రంగా స్థల పురాణాలు తెలియజేస్తున్నాయి. సాక్షాత్తు ఆ పరమశివుడు స్వయంభుగా వెలసినట్లు చెబుతున్నారు. పరమశివుడి దివ్య వాహనమైన నందీశ్వరుడు జన్మస్థలంగా కూడా భావిస్తూ ఉంటారు.అత్యంత పురాతనమైన ఆలయంగా పేరు పొందిన ఈ క్షేత్రంలో కార్తీకమాసంలో స్వయంభుగా వెలసిన మహానందిశ్వరుడికి పూజలు నిర్వహిస్తే ఎన్నో జన్మల పుణ్య ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఈ కార్తీకమాసంలో మహానంది క్షేత్రంలోని గుండ్లగుండం కోనేరులో సూర్యోదయానికి ముందే పుణ్యస్నానం ఆచరించి స్వామివారికి దీపారాధన చేస్తే మంచి జరుగుతుందని చెబుతుంటారు.