ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరు బ్రహ్మాండంగా పనిచేస్తారో వారికే తెలంగాణలో తమ మద్దతు ఉంటుందన్నారు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. పార్టీ పరంగా తామూ చూడమని.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. రేవంత్ చంద్రబాబు శిష్యుడేనని.. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ రెండు మిత్ర పక్షాలు అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పంపకాల విషయంలో నెలకొన్న విభేదాలు పరిష్కరించడానికి అవకాశం ఏర్పడిందన్నారు.
మరో మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు వస్తాయని.. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్నారు. కచ్చితంగా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని ధీమాను వ్యక్తం చేశారు. గురువు శిష్యులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న విద్యుత్ సమస్య, సాగినీటి సమస్యతో పాటు మరికొన్ని సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడి చక్కని పరిపాలన అందించే వారికే తమ మద్దతు ఉంటుందని ప్రస్తుతానికి చంద్రబాబు మాత్రమే మంచి పరిపాలన అందించగల వ్యక్తిని ఆయనకు జై కొట్టామన్నారు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వానికి అయినా ప్రజల నుంచి వ్యతిరేకత ఉంటుందన్నారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. వ్యతిరేకతను ప్రభుత్వానికి అనుకూలంగా మలుచుకుంటే విజయం సాధిస్తారని విస్మరిస్తే పరాజయం తప్పదన్నారు.
మరోవైపు డబ్బు చెల్లించిన టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు వెంటనే ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో ఆందోళన చేపట్టారు. 'నా ఇల్లు- నా హక్'కు నినాదంతో టిడ్కో లబ్ధిదారులతో కలిసి ర్యాలీకి యత్నించారు. ర్యాలీకి అనుమతిలేదంటూ పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో తాడిపత్రిలో ఉద్రిక్త వాతవరణం నెలకొంది. డబ్బు చెల్లించిన టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు వెంటనే ఇళ్ల పనులు పూర్తిచేసి స్వాధీనం చేయాలని ఆందోళన నిర్వహించారు. తాడిపత్రి మున్సిపాలిటీలో పేద, మధ్యతరగతి ప్రజల కోసం గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు వెంటనే అప్పగించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
డబ్బు చెల్లించిన లబ్దిదారులకు నిర్మాణం పూర్తైన ఇళ్లు అప్పగించకుండా జగన్ మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడని ఆరోపించారు. లబ్దిదారులకు డబ్బు వెనక్కి ఇవ్వకపోగా, ఇల్లు కూడా అప్పగించలేదన్నారు. ఇళ్లను అప్పగించే విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తాము ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు తిరగబడతారన్న భయంతోనే పోలీసుల ద్వారా ఎమ్మెల్యే పెద్దారెడ్డి ధర్నాను అడ్డుకున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వస్తే టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని, వాటి రుణాలను మాఫీ చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారన్నారు. ఆధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచినా హామీ నెరవేరలేదని.. టిడ్కో లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.