ఒంగోలు జిల్లాలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో 38,483 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖాధికారులు ప్రాథమికంగా గుర్తించారు. గత రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పలురకాల పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. జిల్లాలో వరి 5,478 ఎకరాలు, మొక్కజొన్న 789 ఎకరాలు, కంది 311 ఎకరాలు, పొగాకు 20,499 ఎకరాలు, మినుము 3,399 ఎకరాలు, శనగ 7,761 ఎకరాలు, పెసర 35ఎకరాలు, జొన్న 67 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మరో 300 ఎకరాల్లో ఉద్యాన పంటలు వర్షాలకు దెబ్బతిన్నట్లు ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను పంపారు. కాగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ శాఖాధికారులు మంగళవారం పర్యటించారు. జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు టంగుటూరు మండలం పొందూరు, నిడమానూరు గ్రామాల్లో పర్యటించి రైతులకు పలు సూచనలు ఇచ్చారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పైరును వర్షానికి ముందు కోయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ పద్ధతులు పాటించడం ద్వారా పంటలు దెబ్బతినకుండా కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖాధికారులు రైతులకు సూచించారు. అలా జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ వ్యవసాయాధికారులు రైతులతో మమేకమై ఆయా పంటలను పరిశీలించి పలు సూచనలు చేశారు.