టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తనపై చేసిన ఆరోపణల్ని నిరూపించాలని సవాల్ చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. వార్డు మెంబర్‌గా కూడా గెలవని లోకేష్.. రెడ్ బుక్ రాస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. తాను 200 ఎకరాలు భూమిని కబ్జా చేశానని లోకేష్ అంటున్నారని.. ఎక్కడ ఉందో చెప్పి నిరూపించాలన్నారు. తనపై లేనిపోని విమర్శలు చేస్తే వంశమే ఉండదన్నారు. 200 ఎకరాలు భూమిని కబ్జా చేశానని లోకేష్ తనను విమర్శిస్తున్నారని.. ఆ 200 ఎకరాలు ఎక్కడ ఉందో చెప్పి.. నిరూపిస్తే ఆ భూమిని వాళ్లకే ఇచ్చేస్తానన్నారు.
తాను కాంగ్రెస్ వాదినని.. ఇప్పటికీ దళితులు కాంగ్రెస్ పార్టీతోనే జీవనం సాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో ఒక్క సీటు గెలుచుకోలేకపోయిందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీతో కలుస్తారు.. ఏపీలో టీడీపీతో కలుస్తారు.. ఏపీలో కూడా తెలంగాణ పరిస్థితి వస్తుందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కేవలం కేసీఆర్ కేటీఆర్ టార్గెట్‌గా రాజకీయం జరిగిందన్నారు. కొంతమందిని రెచ్చగొట్టి.. కాంగ్రెస్ గెలిచిందన్నారు. దీనివల్ల పరోక్షంగా చంద్రబాబుకు మేలు.. టీడీపీ నేతలు ఆనందం తప్ప ఏమీ జరగలేదన్నారు. అభివృద్ధిని అక్కడ అడ్డకుని కుతంత్రాలతో బీఆర్ఎస్‌ని ఓడించి కాంగ్రెస్‌ని గెలిపించారన్నారు. ఇదంతా ఎల్లో మీడియా, చంద్రబాబు ప్లాన్.. రేవంత్ రెడ్డి ఇప్పటికీ టీడీపీనే అన్నారు.
వరద ప్రాంతాలలో సహాయ చర్యలు జరుగుతున్నాయన్నారు నారాయణస్వామి. తిరుపతి కాళహస్తి, గూడూరు ప్రాంతాలలో నష్టం జరిగిందని.. వాళ్లకి సాయం అందిస్తామన్నారు. రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందని.. పంట నష్టం జరిగి, వాళ్లకి అంచనా వేసి.. త్వరలో నష్ట పరిహారం ఇస్తామన్నారు. అందుకే రైతులను ఆదుకుంటామని.. 20 రోజుల్లో నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం జగన్ పాటిస్తున్నారన్నారు. అందుకే జగన్ అంటే తనకు అత్యంత గౌరవం.. పేదల పక్షపాతి జగన్ అన్నారు. విద్యా విధానం రాష్ట్రంలో చాలా బాగా అమలు అవుతుందని.. ప్రతి పేదవాడికి విద్యా వైద్యం అందుబాటులో ఉందన్నారు.