ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్యశ్రీ కింద కొత్త కార్డుల పంపిణీ,,,,రూ.25 ల‌క్షల వ‌ర‌కు ఉచిత వైద్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 09:20 PM

ఆరోగ్యశ్రీ ప‌థ‌కానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటింటికీ స‌రికొత్త కార్డుల పంపిణీకి సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డు లేని పేద కుటుంబమే ఉండ‌టానికి వీల్లేదని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్డుల ద్వారా రూ. 25 ల‌క్షల వ‌ర‌కు పూర్తి ఉచితంగా వైద్యం అందించనున్నారు. నూత‌న ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి మార్గదర్శకాలు జారీ చేశారు. డిసెంబర్ 18 నుంచి కొత్త కార్డులు పంపిణీ చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. అధికారులతో ఆమె బుధవారం (డిసెంబర్ 6) సమీక్ష నిర్వహించారు.


‘ప్రతి ఒక్కరి ఆరోగ్య వివ‌రాలు డిజిట‌లైజ్ చేయ‌డం జ‌గ‌న‌న్న ల‌క్ష్యం. ఫ్యామిలీ డాక్టర్‌, జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష, ఆరోగ్యశ్రీ.. డేటా మొత్తం ఒకేచోట ఉండేలా చ‌ర్యలు తీసుకోవాలి. జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష రెండో ద‌శ కార్యక్రమానికి ముఖ్యమంత్రి త్వర‌లో శ్రీకారం చుడతారు. మ‌రింత ప‌కడ్బందీగా క్యాంపులు జ‌రిగేలా చ‌ర్యలు చేపట్టాలి. మ‌రిన్ని ప‌రీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి’ అని అధికారులకు మంత్రి విడదల రజినీ సూచించారు.


త‌మ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఆరోగ్యశ్రీ ప‌థ‌కాన్ని పూర్తి స్థాయిలో బ‌లోపేతం చేసేలా అడుగులు వేసిందని మంత్రి రజిని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల‌ను ఏకంగా 3257కు తీసుకెళ్లార‌ని గుర్తుచేశారు. రూ. 5 ల‌క్షల‌ లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబం ఆరోగ్యశ్రీ ప‌రిధిలోకి వ‌చ్చేలా సీఎం వైఎస్ జ‌గ‌న్ చ‌ర్యలు తీసుకున్నార‌ని తెలిపారు. రూ. 25 ల‌క్షల విలువైన చికిత్సలు సైతం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందేలా మార్పులు తీసుకొచ్చార‌ని వివ‌రించారు. ‘ఆరోగ్యశ్రీ ప‌థ‌కాన్ని పూర్తి స్థాయిలో బ‌లోపేతం చేసిన ఘ‌న‌త వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే ద‌క్కుతుంది. ఆరోగ్యశ్రీ కార్డుల‌ను కూడా పూర్తి స్థాయిలో ఆధునికీక‌రించాం. ఈ స‌రికొత్త ఆరోగ్యశ్రీ కార్డుల‌ను ప్రతి కుటుంబానికి అతి త్వర‌లో అందజేస్తాం. ఇప్పటికే కార్డుల త‌యారీ ప్రక్రియ ప్రారంభ‌మైంది’ అని మంత్రి విడదల రజిని అన్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా 1.43 కోట్ల కుటుంబాల‌కు ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చేలా చ‌ర్యలు తీసుకున్నామ‌ని మంత్రి విడదల రజిని తెలిపారు. స‌చివాల‌యాల వారీగా ప్రతి ఒక్కరికీ నూత‌న కార్డులు అందుతాయ‌ని చెప్పారు. కార్డుల జారీలో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్తకుండా ప‌క్కాగా చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కొత్తగా రూపుదిద్దుకుంటున్న ఆరోగ్యశ్రీ కార్డుల్లో ముఖ్యమంత్రి జ‌గ‌న్ సూచ‌న‌ల‌ మేర‌కు ఐడీ నంబ‌ర్లు కూడా ఉండేలా చ‌ర్యలు తీసుకోవాలన్నారు. ‘రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివ‌రాలు సుర‌క్షితంగా నిక్షిప్తమై ఉండాలి. ఆ మేర‌కు ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంస్కర‌ణ‌లు చేపట్టింది. మ‌న రాష్ట్రంలో వైద్యం పొందుతున్న అంద‌రి వివ‌రాల‌ను పూర్తి స్థాయిలో డిజిట‌లైజ్ చేస్తున్నాం. గ‌డిచిన ఐదేళ్లుగా ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన వారి వివ‌రాల‌ను సేక‌రించి భ‌ద్రప‌ర‌చాలి’ అని మంత్రి సూచించారు.


జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష రెండో ద‌శ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చ‌ర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేర‌కు అధికారులు ప్రణాళిక రూపొందించాల‌ని మంత్రి ర‌జిని సూచించారు. రెండో ద‌శ జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష శిబిరాల్లో మ‌రిన్ని స్పెషాలిటీ సేవ‌లు అందేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని సూచించారు. వైద్య ప‌రీక్షలు కూడా కొత్తవి చేర్చాల‌ని, అందుకు కావాల్సిన విధి విధానాలు రూపొందించాల‌ని సూచించారు.


‘ప్రజ‌లంద‌రికీ మెరుగైన వైద్యం సులువుగా, పూర్తి ఉచితంగా అంద‌డ‌మే ల‌క్ష్యంగా జ‌గ‌నన్న ప‌నిచేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆలోచ‌న‌లు అమ‌లు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా మ‌న‌మంతా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంది’ అని విడదల రజిని అన్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి ఎం.టి. కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ కార్యద‌ర్శి, డాక్టర్ మంజుల‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె. నివాస్‌, సెకండరీ హెల్త్ డైరెక్టర్, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ వెంక‌టేశ్వర్, డీఎంఈ డాక్టర్ న‌ర్సింహం త‌దిత‌రులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com