రైతులను అన్ని విధాల ఆదుకుంటామని, తేమశాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. సబ్సిడీపై మినుము విత్తనాలు అందిస్తున్నట్లు చెప్పారు. మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకుంటామని, అధైర్య పడవద్దని రా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు రైతులకు భరోసా నిచ్చారు. మంత్రి కారుమూరి పామర్రు, గుడూరు, బందరు, పెడన, బంటుమిల్లి మండలాల్లో పర్యటించి దెబ్బతిన్న వరి పొలాలు, ధాన్యం రాశులు పరిశీలించి రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి, రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తొలిత మంత్రి పైడిముక్కల మండలం గోపవానిపాలెం, పామర్రు మండలం కొండిపర్రు రైతులను, అనంతరం గూడూరు మండలం తరకటూరు రైతులను, బందరు మండలం సుల్తానగరం, అరిసెపల్లి రైతులను బంటుమిల్లి మండలం ఆర్తమూరు, బాసిన పాడు రైతులను మంత్రి కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆరబెట్టిన ధాన్యం రాశులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మిచోంగ్ తుఫాన్ అకాల వర్షాలకు పంట దెబ్బతిన్న రైతాంగానికి అండగా ఉంటామన్నారు. ఎన్యుమరేషన్ బృందాలు ప్రతి గ్రామంలో పర్యటించి పంట నష్టం వివరాలు నమోదు చేసుకుని, అంచనాలు రూపొందించి, రైతులకు పంటల భీమా, ఇన్పుట్ సబ్సిడీ ప్రయోజనాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. తేమశాతంతో సంబంధం లేకుండా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.