తెలంగాణ ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తొలిసారిగా స్పందించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన ఇన్నిరోజుల తర్వాత టీడీపీ అధినేత తన మనసులోని మాటను బయటపెట్టారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల రిజల్ట్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. అహంకారంతో వ్యవహరిస్తే ఏమవుతుందో తెలంగాణలో చూశామంటూ బీఆర్ఎస్ పార్టీ గురించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మరో మూడు నెలల్లో ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితే వస్తుందన్నారు టీడీపీ అధినేత. జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉందన్న చంద్రబాబు.. తనను జైళ్లో పెట్టించిన భయం సీఎం జగన్‌ను వెంటాడుతోందని వ్యాఖ్యానించారు. చేయని తప్పునకు తనను జైళ్లో పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైంది. 64 స్థానాలలో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. టీటీడీపీ మాజీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు అందుకోవటంతో ఏపీ, తెలంగాణలో ఉన్న తెలుగుదేశం శ్రేణుల్లోనూ సంతోషం వ్యక్తమైంది. ఇక ప్రమాణ స్వీకారానికి చంద్రబాబును ఆహ్వానించినప్పటికీ ఆయన రాలేకపోయారు. మరోవైపు సుమారు 3 నెలల విరామం తర్వాత చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. మిచౌంగ్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటపొలాలను ఆయన పరిశీలించారు. శుక్రవారం తెనాలి నియోజకవర్గం నందివెలుగులో పర్యటించిన చంద్రబాబు.. పొలాల్లోకి దిగి నీట మునిగిన చేనును పరిశీలించారు. ఈ సందర్భంగా మిచౌంగ్ తుపాను వల్ల పూర్తిగా నష్టపోయామని రైతులు చంద్రబాబుతో గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీడీపీ అధినేత.. మానవ తప్పిదం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు.
ముందస్తు చర్యలతో నష్ట నివారణ చర్యలకు అన్ని అవకాశాలు ఉన్నా, ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే తనలాంటి వాళ్లను కూడా జైళ్లో పెడతారన్న టీడీపీ అధినేత.. చేయని తప్పుకు ఎంతో మానసిక క్షోభ అనుభవించానన్నారు. మరోవైపు తుపాను ప్రభావిత ప్రాంతాల పరిశీలన కోసం తన షెడ్యూల్ ఖరారైన తర్వాతే.. సీఎం జగన్‌కు ఆ విషయం గుర్తొచ్చిందని చంద్రబాబు విమర్శించారు.తుపానులో నష్టపోయిన రైతులకు వైసీపీ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోతే మరో మూడు నెలల తర్వాత టీడీపీ అధికారంలోకి రాగానే తామే రైతులకు ఇస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.