కోస్తా తీరాన్ని వణికించిన మిచౌంగ్ తుఫాన్ ఈ నెల 5న బాపట్ల పరిసరాల్లో తీరందాటిన సంగతి తెలిసిందే. ఈ తీవ్ర తుఫాన్ ఉత్తరంగా కోస్తా, తెలంగాణ మీదుగా పయనించే క్రమంలో బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది గురువారం సాయంత్రానికి దక్షిణ ఛత్తీస్‌గఢ్.. దానికి ఆనుకుని విదర్భ పరిసరాల్లో ఉంది. సాధారణంగా తుఫాన్ తీరం దాటిన మూడు రోజుల వరకూ దాని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. అందువల్ల గురువారం కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఇవాళ కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, నంద్యాల, అన్నమయ్చ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి జల్లులకు ఛాన్స్ ఉందంటున్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 75.2 మిల్లీ మీటర్లు, అనకాపల్లి జిల్లా చోడవరంలో 74.2, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 66.8, కాకినాడ జిల్లా తునిలో 59.5, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో 56.2, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 45.2, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 43.8, విజయనగరం జిల్లా వేపాడలో 37.2, అనకాపల్లిలో 36.6, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 33.2, విజయనగరం జిల్లా ఎస్ కోటలో 31.6, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 21.2, పార్వతీపురంలో 21.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.