పవిత్ర కార్తీకమాసం సందర్భంగా శనివారం శ్రీవారిమెట్టు వద్దనున్న పార్వేట మండపంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఉదయం7 గంటలకు శ్రీదేవి, భూదేవీసమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవరులను ఊరేగింపుగా పార్వేటిమండపానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామివారి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆ తర్వాత పార్వేట మండపంలో కార్తీక వనభోజనోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆలయ అర్చకులు శ్రీ నారాయణాచార్యులు.. పవిత్ర కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం శ్రీమహావిష్ణువుకి అత్యంత ఇష్టమని చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయంలో 2013 - 14వ సంవత్సరం నుండి టీటీడీ కార్తీక దామోదర వనభోజనం ప్రారంభించినట్లు తెలిపారు. అదే సంవత్సరం నుండి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా కార్తీక వనభోజనాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మరోవైపు కార్తీక వనభోజనం మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
మరోవైపు డిసెంబర్ 10న తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు. కార్తీక మాసంలో స్వాతి తిరునక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా.. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మూలమూర్తికి ఆదివారం ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు ఆలయ అర్చకులు పాల్గొంటారని టీటీడీ ప్రకటనలో పేర్కొంది.