తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించింది. పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి పాలన మొదలెట్టేశారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో ఆయన అభిమానుల్లో ఆనందం ఉప్పొంగుతోంది. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణలోనే కాదు ఏపీలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా పలుచోట్ల ఫ్లెక్సీలు కట్టిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డికి తన ఆర్ట్ ద్వారా అభినందనలు తెలియజేద్దామని అనుకున్న ఓ కళాకారుడికి మాత్రం చుక్కెదురైంది.
బాపట్లకు చెందిన బాలాజీ వరప్రసాద్.. సైకత శిల్పాలు రూపొందిస్తూ ఉంటారు. అంతర్జాతీయ స్థాయిలో పలుసార్లు బహుమతులు కూడా గెలుచుకున్నారు వరప్రసాద్. అయితే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవటం, రేవంత్ రెడ్డి సీఎం కావటంతో.. తన కళద్వారా తెలంగాణ కొత్త ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేద్దామని వరప్రసాద్ భావించారు.రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన సైకత శిల్పాన్ని శనివారం రోజు బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు.. అక్కడకు చేరుకుని సైకత శిల్పం ఏర్పాటును అడ్డుకున్నారు. అనుమతులు లేవంటూ వరప్రసాద్ యత్నాన్ని అడ్డగించారు. అయితే జస్టిస్ ఫర్ సీబీఎన్ అనే పేరుతో సెప్టెంబరు 21న బాపట్ల మండలం పాండురంగాపురం కొత్త ఓడరేవు సముద్రతీరంలో వరప్రసాద్ సైకత శిల్పం రూపొందించారు. దీనికి సంబంధించి అతనిపై కేసు కూడా నమోదైనట్లు సమాచారం. అయితే ఈ విషయాలు ఏవీ తెలియని వరప్రసాద్.. శనివారం రేవంత్ రెడ్డి సైకత శిల్పం ఏర్పాటుకు ప్రయత్నించగా.. గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రసాద్ అడ్డుకున్నారు. అనుమతి లేకుండా సైకత శిల్పం వేయకూడదని చెప్పడంతో.. పర్మిషన్ తీసుకోవడానికి వరప్రసాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అప్పుడే అతనిపై కేసు నమోదైన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో నోటీసులు లేకుండా కేసు నమోదు చేయడం ఏమిటంటూ బాలాజీ వరప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కళాకారులకు ఇలాంటి ఆంక్షలు ఏమిటంటూ వాపోయారు.