కరోనా మహమ్మారి తర్వాత చైనా నుంచి ఏది బయటికి వచ్చినా అది ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. అయితే ప్రస్తుతం చైనా వెల్లుల్లి అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముడవుతోంది. ఈ చైనీస్ వెల్లుల్లి జాతీయ భద్రతకు ముప్పు మాత్రమే కాదు.. మానవ ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరమని అమెరికన్ సెనేటర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే చైనీస్ వెల్లుల్లి తినడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో ఆరోగ్య నిపుణులు, వ్యవసాయ నిపుణులు తేడాలు వివరించారు.
చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వెల్లుల్లి కారణంగా అమెరికా జాతీయ భద్రతకు ముప్పు వచ్చే అవకాశం ఉందని రిపబ్లిక్ పార్టీకి చెందిన రిక్ స్కాట్ అనే ఒక సెనెటర్ కామర్స్ సెక్రటరీకి ఒక లేఖ రాశారు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వెల్లుల్లి సురక్షితం కాదని.. వెల్లుల్లి సాగులో చైనా అపరిశుభ్రమైన సాగు పద్ధతులను అనుసరిస్తోందని పేర్కొన్నారు. చైనాలో ఉత్పత్తి అవుతోన్న వెల్లుల్లి నాణ్యత లేకపోవడంతో ప్రజల ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపిస్తుందని రిక్ స్కాట్ తెలిపారు. చైనాలోని వ్యర్థాలతో వెల్లుల్లి సాగుకు సంబంధించి ఆన్‌లైన్‌లో చాలా వీడియోలు, డాక్యుమెంటరీలు అందుబాటులో ఉన్నాయని ప్రస్తావించారు. వెల్లుల్లి సాగు, నాణ్యతతోపాటు వెల్లుల్లి రకాలపై కూడా లేఖలో స్కాట్ వివరించారు. చైనా వెల్లుల్లి సాగులో వ్యర్థాల వినియోగంపై ఎలాంటి ఆధారాలు లభించలేదని క్యుబెక్‌లోని మెక్‌గిల్ యూనివర్సిటీలోని సైన్స్ అండ్ సొసైటీ తెలిపింది. జంతువుల వ్యర్థాలతో పోల్చితే మానవ వ్యర్థాల ఎరువే ఎక్కువగా ఫలితాలనిస్తుందని.. మానవ వ్యర్థాలను ఎరువుగా సాగు చేయడమనేది వినడానికి బాగా లేకపోయినా.. అనుకున్నదానికంటే ఎక్కువ సురక్షితమని స్పష్టం చేసింది.
చైనీస్ వెల్లుల్లి చాలా వేగంగా పెరుగుతుందని.. తద్వారా మార్కెట్‌లో త్వరగా అమ్ముడవుతుందని డాక్టర్ అన్షుమన్ కుమార్ వెల్లడించారు. చైనీస్ వెల్లుల్లిని పెంచే పద్ధతి చాలా ప్రమాదకరమైనదని.. సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చిన నీటిని ఆ పంటకు ఉపయోగిస్తారని తెలిపారు. చైనీస్ వెల్లుల్లిని శుభ్రం చేయడానికి మిథైల్, క్రోమైడ్ వంటి రసాయనాలను ఉపయోగిస్తారని పేర్కొన్నారు. మిథైల్ క్రోమియం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగించడంతోపాటు నాడీ వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ చైనా వెల్లుల్లిని అంతర్గత భద్రతకు ముప్పుగా అమెరికా భావిస్తోంది. భారీ లోహాలు ఆర్సెనిక్, పాదరసం, ఎముక క్యాన్సర్, ఇతర రకాల క్యాన్సర్లకు కారణమవుతాయని అనుమానం వ్యక్తం చేస్తోంది. మార్కెట్‌లో విక్రయిస్తున్న చైనీస్ వెల్లుల్లి స్థానిక వెల్లుల్లి కంటే రూ. 50 నుంచి రూ. 100 రూపాయలు ఎక్కువ అని తెలుస్తోంది.