కేవలం పర్యాటక రంగంపైనే ఆధారపడే ద్వీప దేశం శ్రీలంక.. కరోనా, లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా దెబ్బతింది. ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో అప్పటి అధ్యక్షుడు, ప్రధాని చేతులెత్తేయడంతో రాజకీయ సంక్షోభం కూడా తలెత్తింది. దీంతో 2022లో ఆ దేశంలో అత్యంత తీవ్ర కరవు, ఆహార, ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం మారి.. కొత్త ప్రభుత్వం రావడంతో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయి. అయితే తాజాగా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు విద్యుత్ సమస్య రూపంలో మరో కొత్త సమస్య ఎదురైంది.
శ్రీలంకలో విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్య ఏర్పడడటంతో మొత్తం దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనిపై శ్రీలంకలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వంటి వాటిని పర్యవేక్షించే సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఒక ప్రకటన చేసింది. అయితే నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు సీఈబీ అధికార ప్రతినిధి వెల్లడించారు. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
కాట్‌మలే, బియగమా మధ్య మెయిన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్లలో సమస్య ఏర్పడిందని తెలుస్తుంది. ఈ కారణంగానే దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు ఇబ్బంది తలెత్తిందని అధికారులు పేర్కొన్నారు. 2022 లో శ్రీలంకలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అక్కడి ప్రజల జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. శ్రీలంక వ్యాప్తంగా ఇంధనం, ఆహార పదార్థాలు, ఔషధాలు ఇలా అన్నింటికీ కొరత ఏర్పడింది. మరోవైపు విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటిపోవడంతో ఇతర దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతోంది.
ఈ క్రమంలోనే గత కొన్నిరోజులుగా శ్రీలంకలో విద్యుత్ కోతలు సర్వ సాధారణం అయ్యాయి. అయితే ఇప్పటికే శ్రీలంకలో రోజుకు దాదాపు 10 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఇప్పుడు శ్రీలంక వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితి గందరగోళంగా ఉంది. రాత్రి వేళ కరెంట్ సరఫరా లేకపోవడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం, విద్యుత్ అధికారులపై ప్రజలు తీవ్రంగా మండి పడుతున్నారు.