వృద్దాప్యంలో తన మంచి చెడులు చూసుకుంటున్న సంరక్షకుడికి ఓ బిజినెస్‌మెన్ భారీ నజరానాను ప్రకటించాడు. అతడిని దత్తత తీసుకుని తన పేరు మీద ఉన్న వేల కోట్ల ఆస్తిని రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు. గత కొన్నేళ్లుగా తాను వృద్ధాప్యంతో బాధపడుతూ ఉంటే అన్ని రకాల సపర్యలు చేసిన సంరక్షకుడికి తన వద్ద ఉన్న రూ.97 కోట్ల ఆస్తిని రాయాలనే నిర్ణయం తీసుకున్నాడు స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ బిలియనీర్. ఈ మేరకు కొన్ని స్విస్ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి.
స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ హెర్మెస్‌ను 1837లో థియెర్రీ హెర్మెస్ స్థాపించారు. థియెర్రీ హెర్మెస్ కుటుంబంలో ఐదో తరానికి చెందిన నికోలస్ ప్యూచ్ వయసు ప్రస్తుతం 80 ఏళ్లు. హెర్మెస్ కంపెనీలోని 5 నుంచి 6 శాతం వాటాలు ఇప్పుడు నికోలస్ పేరు మీద ఉన్నాయి. ప్రస్తుతం నికోలస్ ఆస్తుల విలువ దాదాపు 11 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.97 వేల కోట్లు. అయితే నికోలస్‌కు పెళ్లి కాకపోవడంతో సంతానం కూడా ఎవరూ లేరు. ఈ క్రమంలోనే వృద్ధాప్యంలో ఉన్న నికోలస్ తర్వాత ఆయన పేరుమీద ఉన్న ఆస్తి ఎవరికి దక్కుతుందనేది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలోనే తన ఆస్తికి వారసుడి విషయంలో నికోలస్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు స్విస్ మీడియా పేర్కొంది. గత కొన్నేళ్లుగా తనను అన్ని రకాలుగా చూసుకుంటున్న 51 ఏళ్ల సంరక్షకుడికి పూర్తి ఆస్తిని అప్పగించేందుకు నికోలస్ సిద్ధమైనట్లు సమాచారం. ఆ సంరక్షకుడిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుని.. ఒక న్యాయ బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సంరక్షకుడు ఎవరు అనేది మాత్రం ఆ వార్తల్లో తెలియరాలేదు. ఇప్పటికే ఆ సంరక్షకుడికి 5.9 మిలియన్ డాలర్ల విలువైన తన ఆస్తులను అప్పగించినట్లు సమాచారం.
అయితే కుటుంబంలో ఘర్షణల కారణంగానే నికోలస్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. 2014లో హెర్మెస్ సూపర్‌వైజరీ బోర్డ్ నుంచి నికోలస్ అర్ధాంతరంగా తప్పుకున్నారు. అదే ఏడాది మరో ఫ్యాషన్ కంపెనీ ఎల్‌వీఎంహెచ్.. హెర్మెస్ కంపెనీలో బలవంతంగా 23 శాతం వాటాలను కొనుగోలు చేసింది. దాన్ని అడ్డుకునేందుకు హెర్మెస్ కుటుంబం కంపెనీలోని తమ వాటాలతో ఓ హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయగా.. నికోలస్ మాత్రం తన వాటాను తన వద్దే పెట్టుకున్నారు. ఈ నిర్ణయం హెర్మెస్ కుటుంబంలో గొడవలకు దారితీసింది. ఆ తర్వాత నికోలస్ బోర్డు నుంచి వైదొలిగారు.
అయితే తన ఆస్తిని సంరక్షకుడికి అప్పగించడానికి నికోలస్ చట్టపరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. స్విట్జర్లాండ్ చట్టాల ప్రకారం పెద్దవాళ్లను దత్తత తీసుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. దత్తత వెళ్లే వ్యక్తి మైనర్‌గా ఉన్నప్పుడు కనీసం ఒక ఏడాది పాటు దత్తత తీసుకునే వ్యక్తి ఆ మైనర్‌తో కలిసి జీవించి ఉండాలి. మరోవైపు.. నికోలస్ ఆ సంరక్షకుడిని దత్తత తీసుకుంటే.. దానిపై హెర్మెస్ కుటుంబసభ్యులు కోర్టులో దావా వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.