టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర 218వ రోజు యువగళం పాదయాత్ర తుని నియోజకవర్గం ఒంటిమామిడి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభం కాగా... ఒంటిమామిడి తొండంగి, శృంగవృక్షం, వలసపాకల, టి.తిమ్మాపురం మీదుగా తేటగుండ విడిది కేంద్రానికి చేరుకుంది. నేటితో 3 వేల కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. యువగళం పాదయాత్రలో 219వ రోజు (సోమవారం) చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. యువగళం పాదయాత్ర 3 వేల కి.మీ.ల చేరుకున్న సందర్భంగా తేటగుంట యనమల అతిథిగృహం వద్ద లోకేశ్ పైలాన్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ హాజరు కానున్నారు. లోకేశ్ పాదయాత్ర సోమవారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రవేశించనుంది. ఉభయగోదావరి జిల్లాల నాయకులు, కార్యకర్తలు లోకేశ్ కు వీడ్కోలు పలకనుండగా, యువనేతకు భారీ స్వాగతం పలికేందుకు ఉత్తరాంధ్ర నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా, తుని నియోజకవర్గం శృంగవృక్షం వద్ద కాకినాడ సెజ్ బాధిత రైతులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు.