రాష్ట్రంలో రానున్నది నిశ్శబ్ధ విప్లవం, జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలపడం ఖాయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. కాకినాడ సెజ్ కోసం రైతులు తమ భూములను త్యాగం చేశారు. కాకినాడ సెజ్ బాధిత రైతుల కష్టాలు నాకు తెలుసు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కంపెనీలు తీసుకొచ్చి... స్థానికంగా భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల వారికి ఉద్యోగాలు కల్పిస్తాం. మూడు నెలలు ఓపిక పట్టండి, నేను ఇచ్చిన హామీలు అన్ని నిలబెట్టుకుంటాను అని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.... రాబోయేది ప్రజా ప్రభుత్వం. రైతులు ఎవరికైతే నష్ట పరిహారం అందలేదో వారికి నష్ట పరిహారం అందిస్తాం. కంపెనీల నుండి వచ్చే కలుషిత నీరు బయటకు రాకుండా శుద్ది చేస్తాం. ఎన్ని కోట్లు ఖర్చు అయినా అధునాతన టెక్నాలజీతో ట్రీట్ మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. ఉపాధి ఎంత ముఖ్యమో, కాలుష్యం కలిగించని కంపెనీలు తీసుకురావడం అంతే ముఖ్యం. అధికారంలోకి రావడం లక్ష్యంగా ఆ రోజు జగన్ ఎకరానికి రూ.75 లక్షలు ఇస్తామని మోసం చేశాడు. నేను అలాంటి దొంగ హామీలు ఇవ్వను. సెజ్ రైతులు న్యాయం కోసం పోరాడితే కేసులు పెట్టి వేధిస్తోంది ఈ వైసీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం ప్రజలే చెబుతారు. రైతులకు భూమిపై అనుబంధం ఉంటుంది. అలాంటి భూమిని వైసీపీ మంత్రి మాయా రాజా, వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ కోసం దోచుకుంటున్నారు.
మంత్రి దాడిశెట్టి రాజా, ఆయన అనుచరులు కలిసి దాదాపు 800 ఎకరాలు సెజ్ భూములు కొట్టేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. కంపెనీల కోసమే సెజ్... రియల్ ఎస్టేట్ కోసం కాదు... టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎంక్వైరీ వేసి మంత్రి, వైసీపీ నాయకులు దోచుకున్న భూములు వెనక్కి తీసుకుంటాం. దాడిశెట్టి రాజా మాయా రాజా... ఎన్నికల ముందు రైతులకు అనేక హామీలు ఇచ్చాడు. మంత్రి అయ్యాక మర్చిపోయాడు. సెజ్ కి భూములు ఇవ్వని రైతులపై అక్రమంగా పెట్టిన కేసులు అన్నింటినీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎత్తేస్తాం. ఆక్వా రంగానికి జోన్, నాన్ జోన్ అని సంబంధం లేకుండా యూనిట్ రూ.1.50 కే అందిస్తాం. హేచరీస్ కి కూడా సబ్సిడీలు అందించి ప్రోత్సహిస్తాం. సెజ్ కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల్లో వారికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత టిడిపి-జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అని ఆయన వెల్లడించారు.