అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు జోరందుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్య్ంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే జట్టుకట్టిన టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజల్లోకి దూసుకెళ్లాలని భావిస్తున్నాయి. అందులో భాగంగా ఇరుపార్టీల అధినేతలు.. ఉమ్మడి మ్యానిఫెస్టో అంశం మీద ఇప్పటికే రెండు దఫాలు భేటీ కూడా అయ్యారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఒకే వేదికను పంచుకోలేదు. ఒకే స్టేజీ మీద నుంచి రెండుపార్టీల కార్యకర్తలను ఉద్దేశించి ఇంతవరకూ మాట్లాడలేదు. కానీ ఇప్పుడా సమయం వచ్సేసింది. పొత్తుప్రకటన తర్వాత ఇరువురు నేతలు తొలిసారిగా త్వరలో ఒకే వేదిక మీద కనిపించనున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇప్పటికే మూడువేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ పాదయాత్ర ముగియనుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 20వ తేదీన యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభను టీడీపీ నిర్వహించనుంది. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో ఈ విజయోత్సవ సభను నిర్వహించడానికి తెలుగుదేశం ఏర్పా్ట్లు చేస్తోంది. ఈ సభకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటుగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నారు. పొత్తు ప్రకటన చేసిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొంటున్న సభ కావటంతో.. టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తు్న్నాయి.
ఏపీవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఈ సభకు జనసమీకరణ చేయాలని తెలుగుదేశం భావిస్తోంది. ఈ సభ ద్వారానే వచ్చే ఎన్నికలకు శంఖారావం పూరించాలనేది టీడీపీ యోచన. సభ నిర్వహణ కోసం ఇప్పటికే కమిటీలను సైతం ఏర్పాటు చేసింది. మొత్తం 14 ప్రత్యేక కమిటీలతో సభ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. ఈ కమిటీల్లో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి సీనియర్ నేతలకు స్థానం కల్పించారు.
మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లది బ్లాక్ బస్టర్ జోడీ అంటూ నారాలోకేష్ అభివర్ణించారు. యువగళం పాదయాత్రలో భాగంగా తునిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నించిన నారా లోకేష్... ఎమ్మెల్యేతో కలిసి అవినీతికి పాల్పడిన అధికారులను వదిలిపెట్టేది లేదనిహెచ్చరించారు. అవినీతికి పాల్పడిన ఉద్యోగులను డిస్మిస్ చేసి జైలుకు పంపుతామని అన్నారు. ఇదే సమయంలో టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఇబ్బంది లేకుండా కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.