దశాబ్దాల అనంతరం కాశ్మీరీ వలసదారులకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. కాశ్మీర్ చరిత్రలో అత్యంత దుర్మార్గుడైన పాలకుడి చేతిలో కనీవినీ ఎరుగని మారణకాండను ఎదుర్కొని, అరాచకాలు, అకృత్యాలు, నిర్బంధాలపాలై సర్వసం కోల్పోయి జన్మభూమి నుంచి వలస వచ్చిన కాశ్మీరీ శరణార్ధుల జీవితాలకు భరోసా కల్పిస్తూ రాజ్యసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జమ్మూ, కాశ్మీర్ రిజర్వేషన్ బిల్లు, జమ్మూ, కాశ్మీర్ పునఃవ్యవస్థీరణ బిల్లుల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వైయస్ఆర్‌సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తరతరాలుగా వారికి జరిగిన అన్యాయాలను ఈ బిల్లుల ద్వారా సరిదిద్దగల అవకాశం ఉందని ఆయన అన్నారు. 1389-1413 మధ్య కాలంలో కాశ్మీర్‌ను పర్షియన్ రాజు సుల్తాన్ సికిందర్ పాలనలో తొలిసారిగా హిందువులు పెద్ద ఎత్తున వలస పోయారు. హిందువుల పట్ల సికిందర్ సాగించిన దుర్మార్గాలు, దారుణాలు మాటలకు అందవు. అణచివేత, అకృత్యాలకు భయపడి జన్మభూమి నుంచి పారిపోయే క్రమంలో లక్ష మంది హిందువులు దాల్ సరస్సులో మునిగి దుర్మరణం పాలయ్యారు. నిస్సహాయులైన మహిళలు మానభంగాలకు గురయ్యారు. హిందువులు మత మార్పిడికి అంగీకరించాలి లేదా దేశం విడిచి పారిపోవాలని హుకుం జారీ చేశారు. పారిపోలేని వారిని అక్కడికక్కడే హతమార్చారని శ్రీ విజయసాయి రెడ్డి వివరించారు. సికిందర్ సైనికులు దేవాలయాలు, హిందువుల పవిత్ర స్థలాలను సర్వనాశనం చేశారు. కిరాతకానికి లక్షలాది మంది బలైపోగా కేవలం 10 కాశ్మీరీ కుటుంబాలు మాత్రమే కాశ్మీర్ లోయ నుంచి ప్రాణాలతో బయటపడి వలస పోయారు. తదనంతరం ఆరుసార్లు అణచివేతను తట్టుకోలేక కాశ్మీరి కుటుంబాలు వలస పోయాయి. వలసపోయిన కాశ్మీరి హిందూ కుటుంబాలకు చెందిన భూములు పాలకుల అండదండలతో అన్యులపాలయ్యాయి. జమ్మూ, కాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో విలీనం చేసే లక్ష్యంతో మొదలైన ఉగ్రవాదం రాజకీయ హింసకు అంకురార్పణ చేసిందని శ్రీ విజయసాయి రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు.