విశాఖ వైఎస్సార్‌సీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గాజువాక నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి రాజీనామా చేశారంటూ ప్రచారం జరిగింది. దీంతో నాగిరెడ్డి, దేవన్ రెడ్డిలు ఇవాళ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. రాజీనామా ఊహాగానాలకు చెక్ పెట్టారు.. తాము పార్టీలో ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. తాను, తన కుమారులు ఎప్పుడూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు నమ్మకస్తులుగా ఉంటామన్నారు ఎమ్మెల్యే నాగిరెడ్డి. తాము ఎప్పటికీ పార్టీకి విధేయులమని.. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ శ్రేయస్సు కోసం కంకణబద్ధులై ఉంటామన్నారు. మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావాలని.. అదే తమకు ముఖ్యం అన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సరే కట్టుబడి ఉంటామన్నారు.
సోమవారం తానువ్యక్తిగత పనులు మీద బయటకి వెళ్ళానన్నారు దేవన్ రెడ్డి. వెళ్లేముందు ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ సుబ్బారెడ్డితో కూడా మాట్లాడి వెళ్లానని.. కానీ తాను వెళ్లిన చోట ఫోన్ సిగ్నల్స్ లేవన్నారు. నిన్న తాను మళ్ళీ సిటీకి వచ్చే లోపు తనమీద తప్పుడు ప్రచారం చేశారన్నారు.అయినా తన తండ్రి ఎమ్మెల్యే గా ఉండగా తానెందుకు పార్టీకి రాజీనామా చేస్తానని ప్రశ్నించారు. తాను పార్టీతోనే ఉన్నానని చెప్పి పార్టీ పెద్దలు సుబ్బారెడ్డికి వివరణ ఇచ్చేందుకే తన తండ్రితో కలిసి వచ్చానన్నారుర. తాము ఎప్పటికి ముఖ్యమంత్రి జగన్ మాటకి, పార్టీకి కట్టుబడి ఉంటామని... పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తామన్నారు.