అనంతపురం జిల్లాలో గోవా మద్యం గుట్టురట్టైంది. గోవా నుంచి మద్యాన్ని జిల్లాకు తరలించి అక్రమంగా విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను సెబ్, వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో మద్యం కొనుగోలు చేసి, వాటిని ఐషర్ వాహనంలో పేర్చేవారు. మద్యం పెట్టెలు కనబడకుండా వాటిపైన కోళ్ల వ్యర్థాల సంచులు ఉంచి ఎవరికీ అనుమానం రాకుండా అనంతపురం తరలించేవారు. ఈ మద్యం బాటిళ్లను నగరంతో పాటు తాడిపత్రి, ధర్మవరం పట్టణాలకు చేరవేసేవారు. నిఘా ఉంచిన పోలీసులు బృందాలుగా ఏర్పడ్డారు. సోమవారం పక్కా సమాచారంతో మద్యాన్ని తరలిస్తున్న ఐషర్ వాహనాన్ని, నిందితులను పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసులో బత్తలపల్లి మండలం ఈదురు ముస్టూరుకు చెందిన రవితేజ, పుట్లూరు మండలం చింతర్లపల్లికి చెందిన రామంజినిరెడ్డి, ధర్మవరం పట్టణానికి చెందిన షాహిద్‌ఖాన్, లోచర్ల హరికృష్ణ, జిల్లాలోని తాడిపత్రి పట్టణానికి చెందిన కుళ్లాయప్ప, చన్నా జయచంద్ర ప్రతాప్‌లను సెబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 256 సీసాలు, రూ.35,050 నగదు, ఐషర్ వాహనం, కారును స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో కర్ణాటక నుంచి కూడా మద్యాన్ని తీసుకొచ్చి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో విక్రయిస్తున్నారు.. ఈ క్రమంలో సెబ్ అధికారులు నిఘా పెంచారు. ఈ గ్యాంగ్ ఆటకట్టిస్తున్నారు.