టీడీపీ అధినేత చంద్రబాబు తమిళనాడు పర్యటన ఖాయమైంది. ఆలయాల సందర్శనల్లో భాగంగా ఇవాళ కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూరుకు వెళుతున్నారు. అక్కడి శ్రీరామానుజర్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబు మధ్యాహ్నం 2.30కు హైదరాబాద్ బేగంపేట నుంచి విమానంలో బయలుదేరి చెన్నై విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీపెరుంబుదూరు ఆలయాన్ని చేరుకుంటారు. దర్శనం తర్వాత సాయంత్రం చెన్నై చేరుకుని రాత్రి 8.50కు విమానంలో విజయవాడకు వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉండవల్లిలోని నివాసానికి వెళతారు.
చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరుకావడంతో వరుసగా ఆలయాలను సందర్శిస్తున్నారు. ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత విజయవాడ దుర్గమ్మ.. సింహాచలం అప్పన్నను దర్శనం చేసుకున్నారు. అయితే శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లాలని భావించారు. కానీ తుఫాన్ కారణంగా ఈ పర్యటన రద్దు చేశారు.. ఇవాళ తమిళనాడుకు వెళుతున్నారు చంద్రబాబు. చంద్రబాబు రెండు రోజుల పాటూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడ తుఫాన్ ప్రభావంతో నీటమునిగిన పొలాలను పరిశీలించారు. రైతుల్ని, స్థానికుల్ని కలిసి వారికి ధైర్యం చెప్పారు. అంతేకాదు చంద్రబాబు జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. యువగళం పాదయాత్ర ముగింపు సభలో పవన్ కళ్యాణతో కలిసి చంద్రబాబు పాల్గొంటారు.