ఏపీకి మరోసారి తుఫాన్ ముప్పు పొంచి ఉందంటోంది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని భావిస్తున్నారు. డిసెంబర్ 18 నాటికి ఇది అల్పపీడనంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. శ్రీలంక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగుతోందని భావిస్తున్నారు. అల్పపీడనం తుఫాన్‌గా మారే అవకాశం కూడా ఉంది అంటున్నారు. డిసెంబర్ 21 నుంచి 25 వరకు వర్షాలు కురవొచ్చంటున్నారు. ఒకవేళ తుఫాన్‌గా మారితే ఎటువైపు పయనిస్తుంది అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఏపీవైపుగా వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీపై మరో తుఫాన్ ప్రభావం ఉంటుందని వస్తున్న హెచ్చరికలతో జనాలు భయం గుప్పిట్లో ఉన్నారు. మిచౌంగ్ తుఫాన్ బీభత్సం నుంచి బయటపడుతున్న సమయంలో మరో తుఫాన్ హెచ్చరికతో తీరప్రాంత, సమీప గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. మరో 4రోజుల్లో తుఫాన్ ప్రమాదం పొంచి ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవాళ కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఒకటి రెండుచోట్ల ఆకాశం మేఘాలతో కనిపిస్తుందని.. చిరు జల్లులకు అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే మిచౌంగ్ తుఫాన్ ఏపీపై తీవ్ర ప్రభావం చూపింది. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. తుఫాన్ కారణంగా తీవ్ర నష్టం జరిగింది. వేలాది ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి.. తీవ్ర పంట నష్టం వాటిల్లింది. భారీగా ఆస్తి నష్టం జరిగింది. అలాగే రహదారులు దెబ్బ తిన్నాయి.. ఇప్పుడు తాజాగా ఏపీకి మరో తుఫాన్ గండం పొంచి ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు మన్యంలో మిచౌంగ్ తుఫాన్ తరువాత నుంచి చలి తీవ్రత కొనసాగుతుంది. సోమవారం పాడేరులో 13 డిగ్రీలు కనిష్ఠ, 24 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండటంతో చలి తీవ్రత పెరుగుతుంనది. దీంతో మధ్యాహ్నం వేళల్లో మినహా మిగతా సమయాల్లో చలి వాతావరణం కొనసాగుతున్నది. మరికొన్ని రోజులు చలి ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. హుకుంపేట మండలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సోమవారం ఉదయం 10 గంటల వరకు మంచు కురుస్తూనే ఉంది. దీంతో పాడేరు- అరకు ప్రధాన రహదారిలో వాహనాలు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించాయి.