ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుంచి బయల్దేరి తిరుపతి వెళ్లి తిరిగొచ్చిన ఆర్టీసీ బస్సులో గంజాయి గుప్పుమంది. జగ్గయ్యపేట బస్‌స్టాండ్ నుంచి ఆదివారం ఉదయం తిరుపతి బయలుదేరిన బస్సులో కావలి దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గుర్తు తెలియని రెండు సంచులను గుర్తించి బస్సును పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తామని చెప్పారు. సిబ్బంది, ప్రయాణికులు తమకు ఆలస్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేయడంతో వారు ఫొటోలు తీసుకొని బస్సు నంబర్ నమోదు చేసుకొని బ్యాగ్‌లతో సహా బస్సును వదిలేశారు.
తిరుపతి వెళ్లిన అనంతరం ప్రయాణికులు ఎవరూ బ్యాగ్‌లు తమవి కావని చెప్పడంతో డ్రైవర్లు దానిని తమ దగ్గరే ఉంచుకుని సోమవారం ఉదయం జగ్గయ్యపేట డిపోనకు రాగానే సెక్యూరిటీకి ఇచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది సంచిని తనిఖీ చేయగా వాటిలో మూడు కిలోల గంజాయి ఉండడంతో డిపో మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. బస్సు డ్రైవర్‌తో డిపో మేనేజర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించి బ్యాగులను, గంజాయిని వారికి అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మార్గం మధ్యలో కావలి దగ్గర పోలీసులు తనిఖీ చేసి.. ఈ సంచుల్ని గుర్తించినా అందులో గంజాయిని మాత్రం గమనించలేదు. బస్సు రానుపోను సుమారు 900 కిలోమీటర్లు ప్రయాణించినా సంచులు మాత్రం అలాగే ఉన్నాయి. చివరకు డిపో మేనేజర్ రఘురాం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం బయటపడింది.
కావలి దగ్గర పోలీసుల తనిఖీలు చేస్తున్న సమయంలో.. ఆ సంచుల్ని అక్కడే ఉంచి ఎవరైనా పారిపోయారా.. బస్సులోనే ఉండి.. తమ సంచులు కాదని అబద్దాలు చెప్పారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కావలిలో బస్సు తనిఖీ చేసిన సమయంలో బ్యాగుకు తాళం ఉందని అక్కడ పోలీసులు తెరిచి చూడక పోవటంతో స్మగ్లర్లు తెలివిగా బయటపడ్డారని భావిస్తున్నారు. బ్యాగులో గంజాయి ప్యాకెట్లతో పాటు మొబైల్ , చార్జర్ దొరికాయి. వేరే సంచిలో మహిళల దుస్తులు ఉన్నాయి. చేతి సంచిపై ఉన్న అడ్రస్ ఆధారంగా వారు ఒడిసాకు చెందినవారు కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మొబైల్ ఆధారంగా కేసును దర్యాప్తు చేపట్టారు.