కడప జిల్లా పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి పొలిటికల్ బాంబ్ పేల్చారు. కడపజిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు త్వరలో టీడీపీలోకి వస్తున్నారా అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. 'కడపజిల్లాలో ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీకి జంప్ కావడానికి సిద్దంగా ఉన్నారా..?.. తమ చేరికపై సమాచారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియజేయనున్నారా..?.. ఆ ముగ్గురూ బీటెక్ రవి ద్వారా చంద్రబాబును కలవనున్నారా..?.. బీటెక్ రవి అరెస్టుకు ఈ జంపింగ్ సీక్రెటే కారణమా..?.. ఇంతకీ టీడీపీలోకి జంప్ కానున్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు..?.. త్వరలోనే జంపింగ్ సీక్రెట్ వీడనుందా..?' అంటూ పోస్ట్ పెట్టారు బీటెక్ రవి. ఈ పోస్టులో ఎక్కడా వారి పేర్లు, ఇతర వివరాలను ప్రస్తావించలేదు. అంతేకాదు వీరి చేరికను ప్రస్తావిస్తూ పెట్టిన పోస్టులో అన్నిచోట్లా ప్రశ్నార్థకం ఉంది. బీటెక్ ఓవైపు ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధమంటూనే.. ఎక్కడా ఆ విషయాన్ని కన్ఫం చేయకపోవడం విశేషం. అధికార పార్టీ వైఎష్సార్‌సీకి కొంతకాలంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు.. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా పదవితో పాటూ పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో బీటెక్ రవి సీఎం జగన్ సొంత జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నట్లు సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. ఇంతకీ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరా అనే చర్చ మొదలైంది. బీటెక్ రవి పోస్ట్ పొలిటికల్ స్టంటా.. నిజంగానే ముగ్గురు టీడీపీలోకి వస్తున్నారా అనే ఉత్కంఠ మొదలైంది.