గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్‌సీపీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా గంజి చిరంజీవిని నియమించారు. అయితే ఈ క్రమంలో తాజా పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల స్పందించారు. రాజీనామా చేయడం ఎమ్మెల్యే ఆర్కే వ్యక్తిగత అంశం అన్నారు.. అలాగే ఆయన తప్పుకోవడం పార్టీకి తీవ్ర నష్టమన్నారు. సీఎంకు ఆర్కే సన్నిహితుడు కాబట్టి.. ఆయనతో కూర్చొని మాట్లాడుకుంటే బాగుండేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్కే గెలిచాక ఒక నెల మాత్రమే తమతో సఖ్యతగా ఉన్నారని.. ఆ తర్వాత కార్యక్రమాలకు తమను దూరం పెట్టారన్నారు. పార్టీ పరువు తీయకూడదనే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నామని.. ఈ విషయం అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఆర్కే గెలుపు విషయంలో తన కృషి చాలా ఉందని.. తన వల్లే ఆయనకు మెజార్టీ వచ్చిందన్నారు. తాను కూడా మంగళగిరి నుంచి ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నాని.. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లు సీటు కావాలంటే కుదరదన్నారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.
మంగళగిరి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీలో వరుస పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఎమ్మెల్యే ఆర్కే రాజీనామాతో అక్కడ సీన్ మొత్తం మారిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబానికి సన్నిహితుడైన ఆర్కే తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. 2019లో మంత్రివర్గంలోనే ఆర్కేకు చోటు దక్కుతుందని అందరూ అంచనా వేశారు.. కానీ ఆ అవకాశం దక్కలేదు. గతేడాది మంత్రివర్గంలో మార్పుచేర్పులు చేసినప్పుడు కచ్చితంగా ఆర్కేకి పదవి వస్తుందనుకుంటే అప్పుడూ రాలేదు. అప్పట్లోనే ఆయన పార్టీ వీడతారనే ప్రచారం జరిగింది. సీఎం ఆయన్ను పిలిపించుకుని మాట్లాడటంతో యథావిధిగా పార్టీలో కొనసాగారు. ఇదంతా జరిగిన కొద్ది రోజులకే మంగళగిరి మున్సిపల్ మాజీ ఛైర్మన్, టీడీపీ బీసీ నేత గంజి చిరంజీవి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనతోపాటే సీఎం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే ఆళ్ల.. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నూటికి నూరు శాతం తానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి.. మంగళగిరి బాధ్యతల్ని గంజి చిరంజీవికి ఇస్తారనే వార్తలొచ్చాయి.. ఈ క్రమంలో ఆర్కే ఎమ్మెల్యే పదవితో పాటుగా పార్టీకి కూడా రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు కాండ్రు కమల కూడా తాను టికెట్ రేసులో ఉన్నానని చెప్పడం ఆసక్తికరంగా మారింది.. ఒకవేళ చిరంజీవికి టికెట్ ఖాయమైతే ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. కమల గతంలో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
మరోవైపు ఎమ్మెల్యే ఆర్కే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మరుక్షణంలోనే ఆయన వర్గానికి చెందిన పలువురు ముఖ్యులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. తాడేపల్లిలో ఆర్కే సామాజికవర్గానికి చెందిన తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాలస్వామిరెడ్డి, రూరల్ అధ్యక్షుడు మున్నంగి వివేకానందరెడ్డి, తాడేపల్లి పట్టణ కన్వీనర్ ఈదులమూడి డేవిడ్‌రాజ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మేకా వెంకటరామిరెడ్డి, మంగళగిరి రూరల్ మండల కన్వీనర్ అన్నపురెడ్డి బ్రహ్మరెడ్డి తదతరులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు.