ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. 2013లో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, ఆర్థికంగా మద్దతు ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ హామీ ఇచ్చారని, దాన్ని ఇప్పటివరకూ అమలు పర్చకపోవడం బాధాకరమని కోమటిరెడ్డి అన్నారు. ఢిల్లీలో మంగళవారం (డిసెంబర్ 12) మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం విద్యా్ర్థులు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ‘మోదీ గారికి విజ్ఞప్తి. ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్.. నాడు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న ప్రధానిగా దాన్ని అమలుపరిచే బాధ్యత మీదే. అది మర్చిపోవద్దు. మీరు కూడా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినప్పుడు చెప్పారు. దాన్ని వెంటనే అమలు పర్చాలని డిమాండ్ చేస్తున్నాం’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.