ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెలా జీతాలతో పాటుగా అలవెన్సులు కూడా చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్వర్వులు వచ్చాయి.. జనవరి నుంచి అమలు చేస్తారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి ముందు ఉన్న పద్దతినే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించి అప్పీల్ చేసుకునేందుకు వెసులుబాటు దిశగా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
జనవరి నుంచి అమలు చేయాలని నిర్ణయం
ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలతోపాటు అలవెన్సులు కూడా కలిపి చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. పే ఇన్ టులో డ్యూటీ బేస్డ్ అలవెన్సులను జీతాలతోపాటు కలిపి చెల్లిస్తారు. 2024 జనవరి నుంచి ఈ విధానం అమలు చేయాలని ప్రభుత్వం తెలిపింది.. ఈ మేరకు ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. వచ్చే నెల నైట్ అవుట్, డే అవుట్ అలవెన్సులు, ఓవర్ టైమ్ అలవెన్సులను జీతాలతోపాటు చెల్లించనున్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 50వేలమంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుందని చెబుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత నైట్ అవుట్, డే అవుట్, ఓటీ అలవెన్సులు విడిగా చెల్లిస్తున్నారు. అలా కాకుండా విలీనానికి ముందు ఉన్నట్టుగానే జీతాలతోపాటు చెల్లించాలని ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అలవెన్సులను జీతాలతోపాటు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.
అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు 2017 పీఆర్సీ బకాయిలు, ఎస్‌ఆర్‌బీఎస్ ట్రస్ట్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా త్వరలోనే దశలవారీగా చెల్లించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో విలీనానికి ముందు నుంచి ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్న వారికి పదోన్నతులకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం త్వరలోనే జారీ చేయనుంది. ఆ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 1,026 మందికి పదోన్నతులు కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఆర్టీసీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలపై అప్పీల్ చేసుకునేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.
ఆర్టీసీలో విధులు.. ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల విధులకు ఉన్న వ్యత్యాసాలను పరిగణలోకి తీసుకోవాలంటున్నారు. ఇతర శాఖల్లో తీసుకున్నట్లు క్రమశిక్షణ చర్యలు అమలు చేస్తే ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్బందులు పడతారన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. క్రమశిక్షణ చర్యలపై ఆర్టీసీ ఉద్యోగులు అప్పీల్ చేసేందుకు.. సత్వరమే పరిష్కరించేలా విధి విధానాలను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ముసాయిదాను న్యాయశాఖ పరిశీలనకు పంపారు. త్వరలోనే క్రమశిక్షణ చర్యలపై ప్రత్యేకంగా అప్పీళ్లకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేస్తారని చెబుతున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలతోపాటు అలవెన్సులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని.. ఉద్యోగుల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. డ్యూటీబేస్డ్ అలవెన్సులను ప్రతి నెల జీతాలతోపాటు చెల్లించడం ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది అంటున్నారు.