ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ యువనేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. బీసీ, ఎస్సీలకు జగన్ మాయ మాటలు చెప్పాడని, బీసీ కార్పొరేషన్లు జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు 10 శాతం తగ్గించిన దుర్మార్గుడు జగన్ అని, బీసీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించింది జగన్ ఆరోపించారు. పాయకరావుపేట నియోజకవర్గo పెనుగొల్లులో బీసీ సంఘాల నేతలతో టీడీపీ యువనేత నారా లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. "పాయకరావుపేట పౌరుషాలపేట. ఇక్కడ ప్రజలు చూపించిన ప్రేమ ఎప్పుడూ మర్చిపోలేను. బీసీలకు పుట్టినిల్లు టీడీపీ. బీసీలకు న్యాయం టీడీపీతోనే సాధ్యం. బీసీలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చింది అన్న ఎన్టీఆర్. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించింది టీడీపీ. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ఒక్క టీడీపీ మాత్రమే. ఆదరణ పథకం అమలు చేసింది చంద్రబాబు. కీలకమైన పదవులు బీసీలకు ఇచ్చింది టీడీపీ. నా బీసీ, నా ఎస్సీ అంటూ జగన్ మాయ మాటలు చెప్పాడు. బీసీ కార్పొరేషన్లు జగన్ నిర్వీర్యం చేశారు. బీసీ రిజర్వేషన్లు 10 శాతం తగ్గించిన దుర్మార్గుడు జగన్. బీసీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించింది జగన్. బీసీ మంత్రికి 100 సార్లు సవాల్ చేశా. ఎవరి హయాంలో బీసీలకు న్యాయం జరిగిందో చర్చకు సిద్ధమా అని... అటు నుంచి సౌండ్ లేదు. 64 మంది బీసీలను వైసీపీ నాయకులు చంపేశారు. 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. దామాషా ప్రకారం నిధులు కేటాయించి నిధులు కేటాయిస్తామని హామీ ఇస్తున్నాను." అని లోకేష్ అన్నారు.