ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.. ప్రధాన పార్టీలు కూడా ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీకి షాకిస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత గాజువాక వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ దేవన్ రెడ్డి కూడా పార్టీకి గుడ్ బై చెప్పినట్లు ఊహాగానాలు వినిపించగా.. ఆయన మాత్రం ఇదంతా తప్పుడు ప్రచారం అన్నారు. తాను వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానని.. తనకు వైఎస్ జగన్ ఆదేశాలు కచ్చితంగా పాటిస్తామన్నారు. అలాగే వైఎస్సార్‌సీపీ 11 నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేసింది.. వీరిలో ముగ్గురు మంత్రుల్ని కూడా నియోజకవర్గాలు మార్చేశారు. త్వరలోనే మరికొన్ని మార్పులు ఉంటాయని చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ పరిస్థితి ఇలా ఉంటే.. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసలంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. విశాఖకు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతోంది. అలాగే విశాఖ పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా టీడీపీకి గుడ్ బై చెబుతారంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్, పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో టీడీపీతో పాటుగా మాజీ మంత్రి గంటా స్పందించారు.. ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు.
'5 రూపాయల పేటీఎం చిల్లర కోసం, గత 5 సంవత్సరాలుగా ఇలాంటి చిల్లర పోస్ట్లు పెడుతూ సునకానందం పొందుతూనే ఉన్నారు.. ఇలాంటి చిల్లర పనులు ఇప్పటికైనా మానుకోకపోతే మరో వంద రోజుల తరువాత తాడేపల్లి ప్యాలెస్ బయట ఇలాంటి ఫేక్ పోస్టింగుల షాపు పెట్టుకుని బ్రతకాల్సిందే' అంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు. ఇటు టీడీపీ కూడా ఈ ప్రచారంపై స్పందించింది.. 'మునిగిపోయే వైకాపా పడవ నుంచి ఒక్కో ఎమ్మెల్యే దూకేస్తున్నారు. తట్టుకోలేని సైకో వైకాపా పేటీఎం గ్యాంగ్ ఇదిగో ఇలాంటి ఫేక్ చేసి శునకానందం పొందుతున్నారు'అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ఇద్దరు నేతలు పార్టీ మారడం లేదని తేల్చి చెప్పారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రెండు రోజుల క్రితమే నారా లోకేష్‌ను కలిశారు.. అలాగే ప్రతి రోజూ జగన్ సర్కార్ టార్గెట్‌గా ట్వీట్లు చేస్తున్నారు. ఇటు పల్లా శ్రీనివాసరావు కూడా లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో వీరిద్దరు ఇలా పార్టీ మారుతున్నారంటూ ప్రచారం చేయడం చర్చనీయాంశం అయ్యింది. ఇదంతా వైఎస్సార్‌సీపీ తప్పుడు ప్రచారమని టీడీపీ ఆరోపిస్తోంది.