విశాఖలో ఓ ఆటో డ్రైవర్ నిజాయితీని చాటుకున్నాడు. మహిళ పోగొట్టుకున్న విలువైన బ్యాగును తిరిగి తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాడు. బుధవారం సాయంత్రం భారతి అనే మహిళ భీమిలి నగరంపాలెం నుంచి ఎంవీపీ సర్కిల్ వరకు ఒక ఆటోలో ఎక్కింది. సర్కిల్ దగ్గర ఆటో దిగే సమయంలో తనతో పాటు తెచ్చిన బ్యాగును తీసుకోవడం మర్చిపోయి దిగి వెళ్లిపోయింది. కొంత సమయం తర్వాత ఆమె బ్యాగును మర్చిపోయినట్లు గుర్తించి ఆటో కోసం ఆరా తీసింది. ఆ వెంటనే ఎంవీపీ క్రైమ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తాను ఆటోలో వదిలేసిన బ్యాగులో 5 తులాల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి వస్తువులు, 18,000 నగదు ఉన్నాయని చెప్పారు.
పోలీసులు ఆ వెంటనే రంగంలోకి దిగారు.. ఆమె చెప్పిన వివరాలు ఆధారంగా ఆటో స్టాండ్‌లో ఉండే దూడ సత్యనారాయణ అనే ఒక ఆటో డ్రైవర్ సహాయంతో మహిళ ప్రయాణించిన ఆటోను కనిపెట్టారు. ఆ ఆటో డ్రైవర్ కొండలరావు తనకు బ్యాగ్ దొరికిందని.. స్వచ్ఛందంగా అప్పగించడానికి వస్తున్నట్లు చెప్పాడు. అడిషనల్ డీజీపీ, కమీషనర్ ఆఫ్ పోలీస్ అండ్ అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ డా రవి శంకర్ చేతుల మీదుగా బాధితురాలికు ఆమె బ్యాగును అందజేశారు. మహిళ పోగొట్టుకున్న బ్యాగ్ కనిపెట్టడంలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లకు కానిస్టేబుల్ హరిని మెరిట్ సర్టిఫికెట్ ఇచ్చి అధికారులు అభినందించారు. అలాగే బ్యాగ్ కనిపెట్టేందుకు సహాయం చేసిన ఆటో డ్రైవర్ సత్యనారాయణ, స్వచ్ఛందంగా బ్యాగును అప్పగించిన కొండలరావును ప్రత్యేకంగా అభినందించి క్యాష్ రివార్డులు అందజేశారు. తన బ్యాగును నిజాయితీగా వెనక్కు తీసుకొచ్చి ఇచ్చిన ఆటో డ్రైవర్ కొండలరావుకు మహిళ ధన్యవాదాలు తెలిపారు. పోయిందనుకున్న బ్యాగ్ దొరకడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు.