ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి జగన్ సర్కార్ శుభవార్త. వృద్దులకు, వితంతు, ఒంటరి మహిళ, వివిధ రకాల చేతి వృత్తిదారులకు పింఛన్ పెరగనుంది. వీరికి ప్రతినెలా ఇచ్చే సామాజిక పింఛను మొత్తాన్ని రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచుతున్నారు. ఈ ప్రతిపాదనలకు సంబంధించిన ఫైలు.. ఇవాళ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశం ముందుకు రాబోతోంది.. ఆమోదం తెలియజేస్తారు. 2024 జనవరి నుంచి పింఛన్ మొత్తాన్ని రూ.3,000కు పెంచనున్నట్లు గతంలోనే ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రామాల్లో ఇంటింటికీ మంచినీటి కుళాయిలకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మిచౌంగ్ తుఫాన్, పంట నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలపై చర్చిస్తారు. జనవరి 1 నుంచి 3 వేల రూపాయలకు పెన్షన్ పెంపు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలకు నిధుల విడుదల సహా పలు కీలక అంశాల పై చర్చ జరిగే అవకాశం ఉంది.
తుఫాన్ సమయంలో ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలపై కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు.. కాగా, ఇప్పటికే రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం.. తుఫాన్ నష్టాన్ని అంచనా వేసింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శుల నుంచి కేబినెట్‌లో ఉంచాల్సిన ప్రతిపాదనలను సీఎస్ తెప్పించారు. ఈ కేబినెట్ భేటిలో కీలక నిర్ణయాలు ఉండే అవకాశముందని తెలుస్తోంది.