ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. పలాస బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఆ సమయంలో.. సభలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. సీఎం జగన్‌తో సెల్ఫీ దిగాలని పలాసకు చెందిన ఏడో తరగతి విద్యార్ధి దిలీప్ ప్రయత్నించాడు. నేరుగా సభా ప్రాంగణంలో బారికేడ్లుపై ఎక్కాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ విద్యార్థిని వద్దని వారించారు. అదే సమయంలో సీఎం వైఎస్ జగన్ కూడా అటు వైపు వచ్చారు.. వద్దని వారించి.. అలాంటి ప్రమాదకర ప్రయత్నం చేయొద్దని విద్యార్థికి సూచించారు. ఆ తర్వాత విద్యార్ది దిలీప్‌ను పిలిచి సెల్ఫీ దిగి ఆత్మీయంగా హత్తుకున్నారు. ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. సీఎం స్వయంగా పిలిచి సెల్ఫీ ఇవ్వడంతో పాటుగా హత్తుకోవడంతో దిలీప్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఉద్దానంలో కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తూ రూ.700 కోట్లతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును కంచిలి మండలం మకరాంపురంలో సీఎం జగన్ గురువారం తొలుత ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం రూ.85 కోట్లతో పలాసలో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ బాలుర వసతి గృహాన్ని వరŠుచ్యవల్‌గా ఆరంభించారు. నూతన పారిశ్రామికవాడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలాస రైల్వే గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
కిడ్నీ వ్యాధుల బాధితులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలు అందుతాయన్నారు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. పలాసలో కొత్తగా నెలకొల్పిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలసి పని చేస్తాయన్నారు. ఈ ఆస్పత్రిలో డయాలసిస్ బెడ్లు, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగంలో ఐసీయూ బెడ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫిబ్రవరిలోనే ఇక్కడ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ (మూత్రపిండాల మార్పిడి చికిత్స) కూడా చేసి కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఎంత గొప్పగా పనిచేస్తోందో రాష్ట్రానికి, దేశానికి చూపించాలని చెప్పానన్నారు. కచ్చితంగా ఈ ఫిబ్రవరిలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కార్యక్రమం జరుగుతుందన్నారు.
ఆస్పత్రిలో క్యాజువాలిటీ బ్లాక్, సెంట్రల్ ల్యాబ్ ఉందన్నారు జగన్. రేడియో డయోగ్నోసిస్, ఓటీ కాంప్లెక్స్, నెఫ్రాలజీ డయాలసిస్, యూరాలజీ వార్డులతో పాటు రీసెర్చ్ ల్యాబ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. అత్యాధునిక సీటీ స్కాన్, డిజిటల్ ఎక్స్‌రే, యూరాలజీకి అవసరమైన హోల్మియం లేజర్, యూరో డైనమిక్ మిషన్ లాంటి సదుపాయాలన్నీ ఆస్పత్రిలో ఏర్పాటు చేశామన్నారు. కిడ్నీ ఆస్పత్రిలో 42 మంది వైద్యులు, 154 మంది పారామెడికల్ సిబ్బందితో పాటు సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ పోస్టుల్లో మరో 220 మంది పని చేస్తున్నారు. మొత్తంగా 375 మంది సేవలందించేందుకు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
కిడ్నీ వ్యాధుల చికిత్స కోసం నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు నిర్ధారించిన 37 రకాల మందుల్ని అన్ని పీహెచ్‌సీలలో అందుబాటులోకి తెచ్చామన్నారు. వీటిని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లకు అనుసంధానం చేస్తున్నామన్నారు. ఈ మందులన్నీ ప్రతి పేదవాడికీ ఉచితంగా ఇచ్చేందుకు శ్రీకారం చుడుతున్నామన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్‌ను ఏకంగా రూ.10 వేలకు పెంచామన్నారు. నాన్ డయాలసిస్ పేషెంట్లు, తీవ్ర కిడ్నీ వ్యాధులతో సీకేడీ డిసీజ్‌తో బాధపడుతున్న వారిని కూడా గుర్తించి వారికి రూ.5 వేల పింఛన్ ఇచ్చామన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలకు కారణాలను అన్వేషించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్‌తో పాటు జార్జ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేపట్టినట్లు తెలిపారు. నాలుగు దశల అధ్యయనంలో ఇప్పటికే మూడు దశలు పూర్తయ్యాయని.. ప్రపంచంలో అత్యుత్తమ వైద్యసంస్థగా పేరు పొందిన హార్వర్డ్ మెడికల్ స్కూల్‌తో పాటు నార్త్ కరోలినా యూనివర్సిటీతో కలసి పనిచేసేలా మనందరి ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంటోందన్నారు.