టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో కొనసాగుతుంది. ఈరోజు యలమంచిలి నియోజకవర్గం తిమ్మరాజుపేట నుంచి 224వ రోజు యువగళం పాదయాత్రను యువనేత ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్‌ను యలమంచిలి నియోజకవర్గం, అరబుపాలెం బీసీలు కలిసి... వారి సమస్యలు చెప్పుకున్నారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ.. జగన్ అధికారంలోకి వచ్చాక బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ.75,760కోట్లు దారిమళ్లించారని ఆరోపించారు. బీసీలకు ఎన్టీఆర్ రాజకీయాల్లో 24శాతం రిజర్వేషన్ ఇచ్చారన్నారు. చంద్రబాబు బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచారని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చాక బీసీలకు రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. బీసీల్లోని అన్ని కులాలను గుర్తించి అన్ని రంగాల్లో ముందుకు తెస్తామన్నారు. సొంతిల్లు లేని పేదలకు స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని యువనేత స్పష్టం చేశారు.