విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సేకరించిన భూములను ఆ కర్మాగారానికి బదిలీ చేసే ప్రతిపాదన ఏదీ లేదని ఉక్కు శాఖ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే స్పష్టం చేశారు. సోమవారం, రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ (రాష్ర్టీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రప్రభుత్వం భూములను సేకరించి అప్పగించిందని, తదనంతరం ఆ భూములపై సర్వహక్కులనూ కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు బదలాయించడం జరిగిందన్నారు. ‘స్టీల్ ప్రాజెక్ట్ కోసం ఆ భూములను వినియోగించుకోవడానికి వీలుగా ఉక్కు మంత్రిత్వ శాఖ ఆర్‌ఐఎన్‌ఎల్‌కు పవర్ ఆఫ్ అటార్నీ జారీ చేసింది. అందువల్ల ఆ భూములపై యాజమాన్య హక్కులను ఆర్‌ఐఎన్‌ఎల్‌కు బదిలీ చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేద’ని మంత్రి స్పష్టం చేశారు. బయోఫ్యూయల్స్ (జీవ ఇంధనాలు) వినియోగం, అభివృద్థిని వేగవంతం చేసే ప్రక్రియలో ప్రపంచ దేశాల సహకారాన్ని బలోపేతం చేసే దిశగా భారత్ చొరవతో ప్రారంభమైన గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూటమిలో చేరిన దేశాల సంఖ్య 22కు పెరిగిందని, అలాగే 12 అంతర్జాతీయ సంస్థలు ఈ కూటమిలో సభ్యత్వం పొందాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ పేర్కొన్నారు.