ఒకట్రెండు సమస్యలను పరిష్కరించినంత మాత్రాన మున్సిపల్ కార్మికులు తలపెట్టిన సమ్మె ఆగబోదని ఏపీ మున్సిపల్ కార్మికుల జేఏసీ కన్వీనర్ పోరుమామిళ్ల సుబ్బరాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమస్యలకు సంబంధించి 21 డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 7న సమ్మె నోటీసు ఇచ్చామని, 14న ప్రభుత్వం మున్సిపల్ జేఏసీ నాయకులతో సమావేశం నిర్వహించిందని తెలిపారు. ఈమేరకు సోమవారం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ మున్సిపల్ కార్మికులకు 62 సంవత్సరాల వరకు పదవీ విరమణ వయస్సు పెంచుతూ సర్క్యులర్ జారీచేశారని, అదే విధంగా మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియో చెల్లించేందుకు సర్క్యులర్ జారీచేశారని తెలిపారు. ఇతర డిమాండ్లపై ఇంకా స్పందించనందున రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు డిసెంబరు 27 నుంచి తలపెట్టిన సమ్మె జయప్రదం చేసేందుకు అన్ని వర్గాల కార్మికులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని ఆ ప్రకటనలో కోరారు.