‘నా భర్తను జైల్లో పెట్టి మానసికంగా కక్ష గట్టి వేధిస్తున్నారు. మమ్మల్నిలా వేధించడం కంటే ఒకేసారి చంపేయండి’ అంటూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి భార్య షబానా ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రగుంట్లకు సంబంధించిన ఓ కిడ్నాప్ కేసులో అరెస్టయి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న దస్తగిరిని సోమవారం ఆమె ములాఖత్‌లో కలిశారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడారు. తన భర్త 50 రోజులుగా జైల్లోనే మగ్గుతున్నాడని, బెయిల్ రాకుండా అనేక కేసులు చూపించి పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఆయనపై ఎలాంటి కేసులు లేవని, వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన తర్వాతే తమ కుటుంబానికి ఇబ్బందులు ఎక్కువ య్యాయన్నారు. వివేకా హత్య కేసులో రాజీ కోసం వైసీపీ పెద్దలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని, తాము డబ్బుకు కూడా లొంగకపోవడంతో తమపై కక్షగట్టారని చెప్పారు. కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుఽధీర్‌రెడ్డి అక్రమంగా కేసులు పెట్టించి తన భర్తను జైలుకు పంపించారని అన్నారు. ఈ కేసులో నలుగురు బయటకు వచ్చి తిరుగుతున్నా తన భర్తకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. న్యాయస్థానం కళ్లు తెరిచి న్యాయం వైపు ఎందుకు చూడడంలేదని ప్రశ్నించారు. జడ్జిలు కళ్లు తెరిచి పూర్తిస్థాయిలో విచారించి తీర్పు చెప్పాలని వేడుకున్నారు. ఎర్రగుంట్లలో తమపై కేసు పెట్టిన వారిని అధీనంలో ఉంచుకుని ఉదయం, రాత్రి మహిళా పోలీసులను కాపలా పెట్టారని.. వారు తమతో రాజీ కాకుండా చేస్తున్నారని తెలిపారు. కొంతమంది డబ్బు ఆఫర్ చేసినా నిరాకరించామని.. అందుకే ఇలా పోలీసులకు డబ్బులు ఇచ్చి తన భర్తపై తప్పుడు కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. తమ కుటుంబానికి ఏం జరిగినా పులివెందుల వైసీపీ నేతలు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ కంట తడిపెట్టారు.