‘టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే ‘యువగళం-నవశకం’ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోతుంది. సభకు చంద్రబాబుతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కూడా వస్తున్నారు’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షు లు అచ్చెన్నాయుడు తెలిపారు. యువగళం ముగింపు సభ విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో బుధవారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం అచ్చెన్న మాట్లాడుతూ.. ‘‘ఈ సభకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకు లు కల్పిస్తోంది. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ సభలు, సమావేశాలు నిర్వహించినా అధికారంలో ఉన్న పార్టీ అడ్డుకొనే సంస్కృతి లేదు. జగన్ సీఎం అయిన తరువాత ఈ ధోరణి పెరిగింది. యువగళం విజయవంతం కాకుండా ఎక్కడికక్క డ అడ్డంకులు సృష్టించారు. ఇప్పుడుపోలిపల్లి సభకు బస్సులు కావాలని 2 రోజుల క్రితం ఆర్టీసీని అడిగితే ముందు ఇస్తామన్నారు. రీజనల్ మేనేజర్లకు సమాచారం ఇస్తామని ఆర్టీసీ ఎండీ చెప్పారు. ఇప్పుడు ఇవ్వలేమన్నారు. పలు విద్యా సంస్థ లు, ప్రైవేటు సంస్థలు వారి బస్సులు ఇవ్వడానికి ముందు వస్తే, వారిని ఆర్‌టీఓల ద్వారా బెదిరిస్తున్నారు. అయితే సభకు ఎలాగైనా హాజరు కావాలనే లక్ష్యంతో రాయలసీమ నుంచి ఆరు రైళ్లలో అభిమానులు వస్తున్నారు. మొదట ఈ సభకు ఆంధ్ర వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానం అడిగితే ఇవ్వడానికి వీసీ అంగీకరించారు. ఆ తర్వాత తాజా మాజీ వీసీ ప్రసాదరెడ్డి, వైసీపీ నాయకులు ఒత్తిళ్లు పెట్టడంతో ఇవ్వలేమన్నారు. అందువల్లే పోలిపల్లిలో సభ ఏర్పాటు చేసుకు న్నాం. సుమారుగా ఆరు లక్షల మంది వస్తారని భావిస్తున్న ఈ సభకు పోలీసు బందోబస్తు కూడా భారీగా అవసరం. ఆ మేరకు సహకరించాలని విజయనగరం జిల్లా ఎస్పీని కోరాం. సభ ప్రాంగణంలో 2.5 లక్షల మందికి కుర్చీలు వేస్తున్నాం. ఎల్‌ఈడీ స్ర్కీన్లు పెడుతున్నాం. టీటీపీ, జనసేన రెండూ సమన్వయం చేసుకుంటున్నాయి. ఈ సభ నుంచే ఎన్నికల శంఖం పూరిస్తాం’’ అని తెలిపారు.