బాపట్ల జిల్లా పర్చూరు మండలంలో పోలీసు పహరా మధ్య ఫాం-7 దరఖాస్తులపై విచారణ చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రత్యేక పోలీసు బలగాలతో అధికారులు ఓటర్ల నివాసాలకు వెళ్లి ఫాం-7లపై విచారించారు. పర్చూరు మండలంలో పెద్ద ఎత్తున ఫాం-7ల ద్వారా ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేయటం వివాదంగా మారింది. తొలి విడతలో ఫాం-7లపై త్రిసభ్య కమిటీ పరిశీలించిన వాటికి సైతం తిరిగి విచారణ చేపట్టారు. ఇది మరింత సమస్యగా మారింది. దీంతో జిల్లాలోని పలు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పోలీసు బలగాల మధ్య విచారణ చేపట్టారు. దీనిలో భాగంగా సోమవారం పర్చూరు మండల పరిధిలోని గొల్లపూడి, చిననందిపాడు, ఇనగల్లు, దేవరపల్లి గ్రామాల్లో తహసీల్దార్ సంధ్యశ్రీ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఓటర్ల నుంచి అవసరమైన పత్రాలను సేకరించారు. స్థానికంగా నివాసం ఉంటున్నారా.. లేదా? అని ఆరా తీశారు.మార్టూరు, సంతమాగులూరు సీఐలు పి. అక్కేశ్వరరావు, బి. ప్రభాకర్, ఎస్సై రవిశంకర్‌రెడ్డి, బాపట్ల జిల్లా ప్రత్యేక పోలీసు బలగాలతోపాటు, స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బాపట్ల డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్చూరు స్టేషన్‌కు చేరుకుని గ్రామాల్లో పరిస్థితిని పర్యవేక్షించారు.