జిందాల్ స్టీల్‌తో జరుగుతున్న రహస్య మంతనాలను స్టీల్‌ప్లాంటు అధికారులు బహిర్గతం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. జిందాల్‌తో సమావేశాలను నిరసిస్తూ సోమవారం ఉక్కు పరిపాలనా భవనం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జిందాల్‌తో జరిగిన ఒప్పందాలను ఉక్కు యాజమాన్యం బహిర్గతం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఉక్కు సీఎండీ ఢిల్లీలో ఉండి పెద్దల ఆదేశాలతో జిందాల్ స్టీల్ వ్యవహారాలను చక్కబెడుతున్నారని ఆరోపించారు. ప్లాంటులోకి ఏ ఒక్క ప్రైవేటు సంస్థను రానివ్వబోమని, కర్మాగారం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు. ధర్నా కార్యక్రమంలో నాయకులు డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్, కేఎస్‌ఎన్ రావు, వై.మస్తానప్ప, రమణ, వరసాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.