అంగన్వాడీల సమ్మె ఏడవ రోజూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగింది. జిల్లా, మండల కేంద్రాలు, సీడీపీవో కార్యాలయాల వద్ద అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేదిలేదని స్పష్టం చేశారు. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ, పింఛను తదితర డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కన్నా వెయ్యి ఎక్కువ వేతనం ఇస్తామన్న హామీ ఏమైంది జగనన్నా! అని నిలదీశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. అక్కచెల్లమ్మలకు అండగా ఉంటామంటూ జగన్ పదే పదే చెప్పే మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తాము అక్కాచెల్లెమ్మలం కాదా అని నిలదీశారు. లక్ష మందికిపైగా అంగన్వాడీలు 7 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. సచివాలయ ఉద్యోగులకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించి అంగన్వాడీలపై బెదిరింపులకు దిగింది. దీనిపై మండిపడిన అంగన్వాడీలు సమ్మెను ఉధృతం చేశారు.