దేశంలో జనాభా పెరగకుండా, వృద్ధి రేటు ప్రస్తుతమున్న 6% వద్దే కొనసాగితే 2047 నాటికి భారత్ దిగువ మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థగానే మిగిలిపోతుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. దేశం వేగవంతంగా అభివృద్ధి చెందకపోతే సంపన్న దేశంగా మారడానికి ముందే జనాభా పరంగా పాతబడిపోతుందని అన్నారు. ఆ సమయానికి దేశంపై వృద్ధుల భారం కూడా పడుతుందని చెప్పారు. గడచిన రెండు త్రైమాసికాలలో దేశంలో జీడీపీ వృద్ధి 7.5%గానే ఉందని, కార్మికుల భాగస్వామ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది చాలా తక్కువేనని రాజన్ చెప్పారు.
జీ-20 దేశాలన్నింటిలోనూ మన దేశంలోనే మహిళా కార్మికుల భాగస్వామ్యం అత్యంత తక్కువగా ఉన్నదని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలిపారు. ‘మన వృద్ధి సామర్ధ్యం ఈ రోజు 6%గా ఉంది. జీడీపీ వృద్ధి ఏడాదికి 6%గా ఉంటోంది. దీనిని ప్రతి 12 సంవత్సరాలకు రెట్టింపు చేస్తే 24 సంవత్సరాలకు మన తలసరి ఆదాయం నాలుగు రెట్లు పెరుగుతుంది. ఈ రోజు మన తలసరి ఆదాయం 2500 డాలర్ల కంటే తక్కువగానే ఉంది. దీనిని నాలుగుతో గుణిస్తే 10,000 డాలర్లు అవుతుంది. ఇలా గుణిస్తే ప్రస్తుత వృద్ధి రేటు ప్రకారం మనం సంపన్నులం కాలేము. 2047 నాటికి దిగువ మధ్యతరగతి ఆదాయాన్నే పొందుతాం’ అని వివరించారు. కొన్ని దక్షిణాది రాష్ట్రాలలో సంతానోత్పత్తి రేటు పునరుత్పత్తి రేటు కంటే దిగువకు పడిపోయిందని రాజన్ తెలిపారు.
దీనిపై ఆయన వివరణ ఇస్తూ ‘మనం వేగంగా అభివృద్ధి చెందకపోతే సంపన్నులం కాకముందే దేశం పాతబడి పోతుంది. అప్పుడు వృద్ధుల బాధ్యత కూడా దేశం పైన పడుతుంది’ అని అన్నారు. కార్మికులుగా మారే వారందరికీ ఉపాధి కల్పించాలంటే ప్రస్తుత వృద్ధి వేగం సరిపోదని, పాతబడి పోవడానికి ముందే దేశాన్ని సుసంపన్నం చేయడానికి ఇది చాలదని చెప్పారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు సంపన్నవంతం అయిన తర్వాత ఉత్పత్తి రంగం నుండి సేవల రంగం వైపు మళ్లాయని అన్నారు. సంపన్న దేశాలలో 70% మంది కార్మికులు సేవల పరిశ్రమలోనే పని చేస్తున్నారని, 20% మంది ఉత్పత్తి రంగంలో ఉన్నారని చెప్పారు. నిర్మాణం, వ్యవసాయ రంగాలలో ఐదు శాతం మంది చొప్పున పని చేస్తున్నారని రఘురామ్ రాజన్ తెలిపారు.