మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి హత్యకు కుట్ర జరుగుతోందని.. భార్య షబానా ఆరోపించారు. తన భర్తను తీవ్రంగా వేధిస్తున్నారని.. తన భర్తను మొద్దు శీనులాగా జైల్లో హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను జైలులో పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. తన భర్త బెయిల్‌పై బయటకు రాకుండా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని.. తమ బంధువుల అమ్మాయిని కారులో తీసుకెళ్లారని ఆరోపిస్తూ పోలీసులు దస్తగిరిపై కిడ్నాప్, ఎట్రాసిటీ కేసులు నమోదు చేశారన్నారు. దస్తిగిరికి బెయిల్ రాకుండా ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తమకు చావు తప్ప మరో దిక్కులేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రగుంట్ల పోలీసులు నమోదు చేసిన ఎట్రాసిటీ కేసులో దస్తగిరి అరెస్ట్ అయ్యారు.. 50 రోజులుగా దస్తగిరి కడప సెంట్రల్ జైల్లో ఉన్నారని.. సోమవారం ఆయన బెయిల్ పిటిషన్‌ను కడప కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో కడప జైల్లో ఉన్న దస్తగిరితో ఆయన భార్య షబానా ములాఖత్‌లో కలిశారు. అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో రాజీకి రావాలని పులివెందుల వైఎస్సార్‌సీపీ నేతలు తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఆశ చూపడం, బెదిరించడంలాంటివి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు ఎన్ని కుట్రలు పన్నినా వెనక్కి తగ్గడం లేదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారన్నారు.