ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు అంశం ఇప్పటికే ఖాయమైన సంగతి తెలిసిందే. ఇరు పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో పైనా సంప్రదింపులు జరుపుతున్నాయి. నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ముగింపు నేపథ్యంలో బుధవారం (డిసెంబర్ 20) విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద టీడీపీ విజయోత్సవ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో కలిసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నారు. ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇరువురు నేతలు కలిసి ఆ రోజున కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో టీడీపీ - జనసేన పొత్తులో జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉన్న స్థానాల గురించి పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఓ లిస్టు కూడా చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఆ జాబితా ప్రకారం.. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించే స్థానాలివే..
1. భీమిలి
2. గాజువాక
3. యలమంచిలి/ పెందుర్తి
4. పాడేరు
5. రాజానగరం
6. రాజమండ్రి రూరల్
7. కాకినాడ రూరల్
8. పిఠాపురం
9. పి.గన్నవరం
10. రాజోలు
11. నరసాపురం
12. భీమవరం
13. తాడేపల్లిగూడెం
14. ఉంగుటూరు/ ఏలూరు నిడదవోలు/ తణుకు
15. కొవ్వురు
16. అవనిగడ్డ
17. పెడన
18. కైకలూరు
19. తెనాలి
20. గుంటూరు వెస్ట్
21. గిద్దలూరు
22. దర్శి
23. నెల్లూరు
24. తిరుపతి
25. మదనపల్లి
26. రాజంపేట
నిశితంగా గమనిస్తున్న బీజేపీ!
పొత్తులో భాగంగా జనసేనకు ఈ 26 స్థానాలు కేటాయించనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, అటు జనసేన గానీ, ఇటు టీడీపీ గానీ.. ఈ వార్తను ధ్రువీకరించాల్సి ఉంది. ఏదేమైనా.. సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య ఇప్పటికే పలు ధఫాలు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ నివాసంలో ఆదివారం (డిసెంబర్ 17) జనసేనానితో చంద్రబాబు నాయుడు భేటీ సందర్భంగానూ పొత్తు, సీట్ల సర్దుబాటు అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు.. టీడీపీ, జనసేన పార్టీల మధ్య జరుగుతున్న పరిణామాలను బీజేపీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్.. టీడీపీతో కలిసి ముందుకెళ్లాలని నిర్ణయిస్తే, జనసేనతో పొత్తు పెట్టుకోవాలా? లేదా ఒంటరిగానే బరిలోకి దిగాలా? అని బీజేపీ నేతలు సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం.