విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న ఏపీకి చెందిన పేద విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. అలాగే సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి కూడా ఆర్థిక తోడ్పాటును అందిస్తోంది. జగనన్న విదేశీ విద్యాదీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ విడుదల చేయనున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.6 కోట్లను, సివిల్ సర్విసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా రూ.100.5 లక్షలను మొత్తం రూ.42.6 కోట్లను సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో నేరుగా జమచేస్తారు.
సివిల్ సర్విస్ పరీక్షలో ప్రిలిమినరీ పరీక్ష పాసైన విద్యార్థులకు రూ.1లక్ష ప్రోత్సాహకం.. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైతే అదనంగా మరో రూ.50 వేల ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల అభ్యర్థులకు అవసరమైన శిక్షణతోపాటు వారు సొంతంగా ప్రిపేర్ అయ్యేందుకు ఆర్థికంగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అభ్యర్థులు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు పాసైన ప్రతిసారీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నగదు ప్రోత్సాహకం అందిస్తోంది. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్/టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం సహా 21 కోర్సుల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు.. ఇతర విద్యార్థులకు రూ.1 కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు విమాన ప్రయాణం, వీసా ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. ప్రపంచంలోని టాప్–320కి పైగా అత్యుత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకునేందుకు రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. గడిచిన 10 నెలల్లో కేవలం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కింద 408 మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.107.08 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఇతర వివరాల కోసం https:// jnanabhumi.ap.gov.in ను చూడవచ్చు.
ఈ పథకం ద్వారా ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీలలో సీటు పొంది , పీజీ, పీహెచ్డీ లేదా ఎంబీబీఎస్ చేసే విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్ ఇస్తారు. వార్షిక ఆదాయ పరిమితి రూ.8 లక్షలు. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింప చేయనున్నారు. టాప్ 200 యూనివర్సిటీల్లో ఎన్ని సీట్లు సాధిస్తే అంతమందికీ సంతృప్త స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించనున్నారు. 35 ఏళ్లలోపు ఉన్న వారిని అర్హులుగా గుర్తిస్తారు. ఏపీలో స్థానికులై ఉండాలి.. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింప చేయనున్నారు. ఏటా సెప్టెంబరు–డిసెంబరు, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపు కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది.