చిత్తూరు జిల్లాలో ఆన్‌లైన్ మోసాలకు ఓ యువకుడు బలయ్యారు. ఉద్యోగ వేటలో ఉన్న యువకుడు సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటయ్యాడు. మొదట్లో కొంత మేర లాభం వచ్చినా.. తర్వాత క్రమంగా డబ్బులు పోయాయి. దీంతో మళ్లీ సంపాదించాలని ప్రయత్నంలో అప్పులు చేశాడు. పుంగనూరు మండలం చండ్రమాకులపల్లెకు చెందిన జయరాం, సుజాతల కుమారుడు వెంకటేష్ (23) డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగం వేటలో ఉన్నారు. తల్లి చిన్నప్పుడే మరణించగా.. తండ్రి వెళ్లిపోయారు. వెంకటేష్ అతని మేనమామ భాస్కర్ దగ్గర పెరిగాడు. చదువు పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డారు. వరుసగా డబ్బులు పోవడంతో.. తెలిసిన వారి నుంచి రూ. 6 లక్షల మేర అప్పు చేసి కూడా పెట్టుబడులు పెట్టారు. అవి తిరిగి రాకపోవడం, అప్పులు తీర్చే దారి తెలియలేదు. అప్పుల విషయం మేనమామకు తెలిస్తే మందలిస్తాడనే భయంతో ఉదయాన్నే మేడపైన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గుర్తించి మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. కన్నబిడ్డగా చూసుకున్నామని ఇలా అవుతుందని ఊహించలేదని అతని మేనమామ, కుటుంబ సభ్యుల కన్నీటిపర్యంతం అయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.